KCR: చీర, తాంబూలాలతో మంత్రులు సీతక్క, సురేఖకు కేసీఆర్ స్వాగతం..
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:20 PM
మేడారం జాతరకు కేసీఆర్‌ను అధికారికంగా ఆహ్వానించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన మహిళా మంత్రులు కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు రావాలని ఆహ్వానపత్రిక అందించారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 8: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు(కేసీఆర్)ను తెలంగాణ మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ కలిశారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు.
రాజకీయాలకతీతంగా ఈ పవిత్ర జాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ జాతరలో అందరూ పాల్గొనాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కోరారు. తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. జాతరకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానిస్తున్నామని సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలో జరిగే ఈ మహా జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్‌కు కూడా మంత్రులు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
మేడారం జాతరకు రావాలంటూ తెలంగాణ మంత్రులు ఆహ్వాన పత్రికను అందజేసిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా హ్యాండిల్‌లో తెలియజేసింది. సదరు వీడియోనూ పోస్టు చేసింది. మహిళా మంత్రుల్ని కేసీఆర్ బాగున్నరా.. అమ్మ! అంటూ ఆత్మీయంగా ఆహ్వానించారని.. ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం పలికారని తెలిపారు. అతిథి మర్యాదలతో, పసుపు కుంకుమలు.. చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం చేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్, శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సంప్రదాయ పద్ధతిలో సత్కరించారని వివరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు.. కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారని పేర్కొన్నారు. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
Read Latest Telangana News And Telugu News