CM Revanth Reddy: ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:06 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్, జనవరి 8: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం వల్ల వెట్టిచాకిరి ఆగిపోయిందని, గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. అలాగే పనికితగ్గ వేతనం డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశంలో 80 శాతం మంది ఈ ఉపాధి హామీపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందని సీఎం రేవంత్ ఆరోపించారు. పథకం పేరు మార్పు వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ (SIR) వెనుక పెద్ద కుట్ర ఉందని.. వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఉపాధి హామీని రద్దు చేస్తే మళ్లీ వలసలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు, అదానీ-అంబానీలకు ప్రజలను కూలీలుగా మార్చేందుకు ఉపాధి హామీని రద్దు చేస్తున్నారని విమర్శించారు. వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాల విషయంలో క్షమాపణ చెప్పే వరకు వదల్లేదని.. ఇప్పుడు ఉపాధి హామీ విషయంలోనూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు.
కార్యకర్తల త్యాగాల వల్లే...
ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తల పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు. కార్యకర్తల కష్టం, త్యాగాలతోనే అధికారంలో ఉన్నామని.. వచ్చిన పదవులన్నీ కార్యకర్తలు ఇచ్చినవేనని చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతంపైగా కాంగ్రెస్ గెలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలవాలని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోడని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులంతా కష్టపడి పైకొచ్చినవారేనని, పార్టీ అవకాశం ఇస్తే తనతోపాటు ఎవరికైనా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?
Read Latest Telangana News And Telugu News