Congress Master Plan: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:52 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అయితే, వారి ప్రచారాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
హైదరాబాద్, జనవరి 08: రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు ఈ బహిరంగ సభలు నిర్వహించాలని తేదీలను ఫిక్స్ చేసింది. ఈ బహిరంగ సభల సమన్వయ బాధ్యతను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. వీటిని పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కట్టబెట్టింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు వేదికగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మండలాల్లో సైతం ఈ సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక మండలం బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అందుకోసమే ఈ భారీ సభలు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని.. ఈ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విమర్శలు తిప్పికొట్టేందుకు ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈ సభల వేదిక మీద నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మీ తదితర పథకాలు అమలును వివరించడం ద్వారా ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్ట వచ్చనే లక్ష్యంలో ఈ కీలక నిర్ణయాన్ని ఆ పార్టీ తీసుకుంది.
అంతేకాకుండా.. ఆయా జిల్లాల్లోని స్థానిక సమస్యలతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అందుకోసం భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామంటూ ఆయన ఇప్పటికే మీడియా వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. అలాంటి వేళ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ దిశగా ఆ పార్టీ అగ్రనాయకత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జనగణన తొలిదశకు రంగం సిద్ధం.. కేంద్రం నోటిఫికేషన్ జారీ
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
For More TG News And Telugu News