CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో హిమాచల్ ప్రదేశ్ మంత్రి భేటీ.. విద్యా విధానంపై ఆరా..
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:34 PM
తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యా విధానంపై ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను సీఎం రేవంత్‌ను అడిగి ఆయన తెలుసుకున్నారు.
హైదరాబాద్, జనవరి 08: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని త్వరలో తెలంగాణలో అమలు చేయనున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ కుమార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని సైతం కల్పించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయనకు రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ సచివాలయంలో ఇవాళ(గురువారం) సీఎం రేవంత్ రెడ్డిని హిమాచల్‌ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న విద్యా విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి రోహిత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మల్లెపల్లిలోని ఐటీఐని సందర్శించాలని మంత్రి రోహిత్ కుమార్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు కానున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై రోహిత్ కుమార్ ఆసక్తి కనబరిచారు.
ఈ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి.. సమగ్ర నివేదికను తమకు అందించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను హిమాచల్ ప్రదేశ్ మంత్రి కోరారు. అలాగే ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రేవంత్ రెడ్డి విజన్‌ను రోహిత్ కుమార్ అభినందనలతో ముంచెత్తారు.
రాష్ట్ర విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను హిమాచల్‌ప్రదేశ్ మంత్రికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ వివరించారు. 25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సోదాహరణతో రోహిత్ కుమార్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయనకు సీఎం రేవంత్ వివరించారు. అందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని.. త్వరలోనే పాలసీని తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డితోపాటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
జనగణన తొలిదశకు రంగం సిద్ధం.. కేంద్రం నోటిఫికేషన్ జారీ
For More TG News And Telugu News