Tirumala Parakamani Case: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:21 PM
తిరుమల పరకామణి కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐడీని ఆదేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్‌షీట్ దాఖలు వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.
అమరావతి, జనవరి 08: పరకామణి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని.. చట్టప్రకారం ముందుకెళ్లాలని ఏసీబీ డీజీ, సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశించింది. అలాగే బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీ పరకామణి కేసు విచారణ సందర్భంగా గురువారం నాడు ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే నిందితుడు రవికుమార్‌తో కుమ్మక్కై పరకామణి కేసును.. టీటీడీ, పోలీసులు బలహీన పరిచారని పేర్కొంది. నిందితుడు రవికుమార్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని.. సీఐడీ, ఏసీబీ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుందని తెలిపింది. నిందితుడు రవికుమార్ ఆస్తులు స్వీకరించే క్రమంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించలేదని ఏపీ హైకోర్టు వెల్లడించింది.
ఇక మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐడీని ఆదేశించింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్‌షీట్ దాఖలు వరకూ దర్యాప్తును పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పరకామణిలో సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడికి సమర్పించిన కానుకల లెక్కింపు విధానం మెరుగు పరిచేందుకు.. అత్యుత్తమ ఆలోచనలతో రావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.
తిరుమల శ్రీవారి పరకామణిలో చేపట్టాల్సిన సంస్కరణలపై నివేదికను ఇటీవల ఏపీ హైకోర్టుకు టీటీడీ సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణలపై ఏపీ హైకోర్టుకు టీటీడీ సోమవారం అంటే.. జనవరి 5వ తేదీన నివేదిక అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన ఏపీ హైకోర్టు గురువారంపై విధంగా స్పందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జనగణన తొలిదశకు రంగం సిద్ధం.. కేంద్రం నోటిఫికేషన్ జారీ
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
For More AP News And Telugu News