తన టిప్పరే కారు మీద పడి..తారులో కూరుకుపోయి..
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:17 AM
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీ తయారు చేసిన బీటీ తారును తరలిస్తున్న టిప్పర్.. ఆ సంస్థ యజమానుల్లో ఒకరు ప్రయాణిస్తున్న కారుపైనే బోల్తా పడింది.
కారుపై టిప్పర్ బోల్తా.. కారులోని టిప్పర్ యజమాని మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
నవీపేట, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీ తయారు చేసిన బీటీ తారును తరలిస్తున్న టిప్పర్.. ఆ సంస్థ యజమానుల్లో ఒకరు ప్రయాణిస్తున్న కారుపైనే బోల్తా పడింది. ఈ ఘటనలో టిప్పర్‌లోని వేడివేడి తారు అంతా కారుపై పడిపోగా.. కారులో ఉన్నవారు బయటకు వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో కారు వెనుక సీటులో ఉన్న ఏలేటి నవీన్ చంద్రారెడ్డి(47) అనే వ్యాపారి తీవ్రమైన కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన నవీన్ చంద్రారెడ్డి పలువురి భాగస్వామ్యంతో రెంజల్ మండలం కళ్యాపూర్ శివారులో సాయిశక్తి కన్‌స్ట్రక్షన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు.
శనివారం ఉదయం ప్లాంట్‌కు వెళ్లిన నవీన్‌చంద్రారెడ్డి అక్కడి కార్మికులతో మాట్లాడి పనులు పరిశీలించి కారులో నవీపేట వైపు బయలుదేరారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ కారు నవీపేటలోని ఆశానగర్ కాలనీ సమీపానికి చేరుకుంది. అదే సమయానికి నవీన్ చంద్రారెడ్డి కంపెనీకి చెందిన ఓ టిప్పర్ బ్లాక్ తార్ (డాంబరు)లోడ్‌తో వస్తూ ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపు తప్పిన టిప్పర్ ఆ కారుపైనే బోల్తాపడింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు కావడమే కాక టిప్పర్‌లోని వేడి తారు మొత్తం కారుపై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
కారు డ్రైవర్ రాచర్ల ప్రసాద్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. అయితే, కారు వెనుక సీటులో ఉన్న నవీన్ చంద్రారెడ్డి వేడి తారు కింద చిక్కుకోవడంతో ఆయనను గుర్తించలేకపోయారు. కొద్దిసేపటికి కారులో మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు కారుపై పేరుకుపోయిన వేడి తారును తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చాలాసేపు కష్టపడి నవీన్ చంద్రారెడ్డిని బయటకు తీసేసరికి ఆయన శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలున్నాయి. క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా నవీన్ చంద్రారెడ్డి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. నవీన్ చంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News