బాన్సువాడలో నాటు బాంబుల కలకలం
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:02 AM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో నాటు బాంబుల పేలుడు ఘటన కలకలం సృష్టించింది.
అడవి పందుల వేట కోసం తీసుకెళ్తుండగా పేలుడు
ఏడుగురికి తీవ్రగాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
బాన్సువాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో నాటు బాంబుల పేలుడు ఘటన కలకలం సృష్టించింది. అడవి పందుల వేట కోసం కొందరు నాటు బాంబులను తీసుకుని వెళ్తుండగా అవి ఒక్కసారిగా పేలడంతో అక్కడున్న ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ మండలంలోని తాడ్రోల్ గ్రామం ఎర్రమన్నుకుచ్చ ప్రాంతానికి చెందిన కొంతమంది నాటుబాంబులతో ప్రతిరోజు సాయం త్రం అడవి పందుల వేటకు వెళ్తారు.
రోజూలాగే ఆదివారం ద్విచక్ర వాహనంలో బాంబులు తీసుకెళ్తుండగా.. అందులో ఓ వ్యక్తి బాంబు పేలుతుందో లేదోనని ఓ బాంబును ఇళ్ల మధ్యలో ఉన్న సిమెంట్ రోడ్డుపై కొట్టి పరీక్షించాడు. అది పేలి వాహనంలో ఉన్న మిగతా బాంబులపై పడటంతో ఒక్కసారిగా అవన్నీ పేలిపోయాయి. ఆ సమయంలో అక్కడున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి రాజు, కూతుళ్లు అంజలి, శ్రీదేవితో పాటు కడమంచి రమేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషయమంగా ఉండడంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు ప్రారంభించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, పట్టణ సీఐ తుల శ్రీధర్, రూరల్ సీఐ తిరుపతయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News