Share News

పుస్తకం..ఓ మంచి నేస్తం

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:11 AM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలంటారు. కళ్ల ముందు ప్రపంచాన్ని ఉంచుతుంది. ఆలోచనలను విశాలం చేస్తుంది. కొత్త మనిషిగా లోకానికి పరిచయం చేస్తుంది.

పుస్తకం..ఓ మంచి నేస్తం
National Library Day

  • నేటితరంలో తగ్గిన పఠనాసక్తి

  • సాంకేతికతకు అనుగుణంగా మారని గ్రంథాలయాలు

  • నగరంలో ఒక్కటీ లేని డిజిటల్‌ లైబ్రరీ

  • నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలంటారు. కళ్ల ముందు ప్రపంచాన్ని ఉంచుతుంది. ఆలోచనలను విశాలం చేస్తుంది. కొత్త మనిషిగా లోకానికి పరిచయం చేస్తుంది. మట్టికరిచిన మనిషిని సైతం పైకిలేపి నిలబెడుతుంది. ‘పుస్తకం మనిషిని ఉన్నతీకరిస్తుందని’ అంబేద్కర్‌ మహాశయుడు అందుకే అన్నాడేమో.! ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలలో వేలకొద్దీ స్నేహితులున్నా దొరకని ఆత్మస్థైర్యాన్ని ఒక పుస్తకం ఇవ్వగలదు. ఓటీటీ, యూట్యూబ్‌లలో ఉర్రూతలూగించే వెబ్‌సిరీ్‌సలు చూసినా కలగని ఆనందాన్ని కూడా పుస్తకంతోనే పొందచ్చు. నగరంలో 83 పౌర గ్రంథాలయాలున్నాయి. ప్రతీ లైబ్రరీలో యువతీ, యువకుల సందోహమే! కాకపోతే వారంతా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు. ఈ తరంలో సాహిత్య పఠనాసక్తిని పెంపొందించడానికి మంచి అవకాశం. అయినా అందుకు నడుం కట్టేదెవ్వరు?


అటెండర్లే గ్రంథ పాలకులు

స్వాభిమాన పోరాటానికి దారి చూపిన గ్రంథాలయాలు ఈనాడు సోయి తప్పాయి. నగర గ్రంథాలయ సంస్థ పరిధిలోని పౌర గ్రంథాలయాలలో రెగ్యులర్‌ సిబ్బంది 21మంది మాత్రమే పనిచేస్తున్నారు. గ్రంథాలయాలను కొన్నిచోట్ల అటెండర్లు, స్వీపర్లే నిర్వహిస్తున్నారని చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసంగా 60మంది లైబ్రేరియన్లనైనా ప్రభుత్వం నియమించడం ద్వారా మన జ్ఞాన భాండాగారాల స్ఫూర్తి నిలుస్తుందన్నది నిపుణుల అభిప్రాయం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద కొండాపూర్‌లో కోఫోర్జ్‌ లైబ్రరీ నగరంలో కొత్త సంస్కృతికి నాంది పలికింది.


తెలుగు, హిందీ, ఇంగ్లిషులో 15వేలకుపైగా పుస్తకాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు 365రోజులూ పాఠకులకు ఐటీ కారిడార్‌లోని ఆ గ్రంథాలయం ఆహ్వానం పలుకుతోంది. యువత, పిల్లలు ఈ బుక్స్‌, ఆడియో పుస్తకాలకన్నా అచ్చు పుస్తకాలు చదవడానికే అమితాసక్తి కనబరుస్తున్నారనడానికి కోఫోర్జ్‌ లైబ్రరీతో పాటు హైదరాబాద్‌ బుక్‌ఫెయుర్‌, హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్స్‌కు యువత నుంచి లభిస్తున్న ఆదరణే నిదర్శనం.


city3.2.jpgఏఐ యుగంలో లైబ్రరీ

విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్‌లో ఒక్కటీ పూర్తి స్థాయి ఆధునిక పౌర గ్రంథాలయం లేకపోవడం శోచనీయం. న్యూయార్క్‌ పబ్లిక్‌ లైబ్రరీలో మూడు లక్షలకుపైగా ఈ పుస్తకాలు, ఆడియో పుస్తకాలున్నాయి. తమకు అవసరమైన పుస్తకాలను సభ్యులు ఇంటి నుంచి వెబ్‌సైట్‌, యాప్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా చదివే వెసులుబాటు ఆ గ్రంథాలయం కల్పిస్తోంది. ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకిలోని ఓడి సెంట్రల్‌ లైబ్రరీలో సందర్శకుల కోసం ఆడియో, వీడియో స్టూడియో కూడా అందుబాటులో ఉంచారు. బడంగ్‌పేటలోని లైబ్రరీలో కాస్తంత మెరుగైన సాంకేతిక సేవలున్నాయని సందర్శకులు చెబుతున్నారు. మన గ్రంథాలయాల్లో పాత పత్రికలు, పుస్తకాలు కొన్ని డిజిటలైజేషన్‌ అయ్యాయి. కనీసం వాటినైనా పాఠకులకు అందుబాటులో ఉంచాలని సంగిశెట్టి శ్రీనివాస్‌ కోరుతున్నారు.


డిజిటలైజేషన్‌ చేయాలి

అరుదైన రాతప్రతులు, తాళపత్రాలు హైదరాబాద్‌లో మాత్రమే కొలువుదీరున్నాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా డిజిటలైజ్‌ చేయాలి. లైబ్రరీలు కేవలం రీడింగ్‌ రూములుగా మిగిలిపోకూడదు. లైబ్రరీలకు రోజూ వస్తున్న పోటీపరీక్షల అభ్యర్థులకు సాహిత్య పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచాలి.

  • చేగోని రవికుమార్‌, తెలంగాణ గ్రంథాలయ సంఘం


ఈ వార్తలు కూడా చదవండి:

బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..

వికారాబాద్‌ జిల్లాలో నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 11:11 AM