కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శిగా అర్చనావర్మ నియామకం
ABN , Publish Date - Aug 12 , 2026 | 10:33 AM
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు జలశక్తి శాఖ కార్యదర్శిగా ఉన్న వీఎల్ కాంతారావుపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అర్చనావర్మను నియమించారు..
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకూ జలశక్తి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన వీఎల్ కాంతారావుపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన్ను అధికార భాషా శాఖ ఓఎస్డీగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కేంద్ర వాటర్ మిషన్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న అర్చనా వర్మను కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శిగా నియమించారు. దీంతో జలశక్తి శాఖలో పరిపాలనా స్థాయిలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లైంది.
నదీ జలాల వివాదాల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయారనే ఆరోపణలు కాంతారావుపై వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య కొనసాగుతున్న ఉమ్మడి జల వివాదాల విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాల అమలుపై ఆయనపై విమర్శలు వచ్చినట్లు సమాచారం. ఈ అంశాలతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలోనే కాంతారావును బదిలీ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న అర్చనా వర్మకు నదీ జలాల వివాదాలు, రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశాలు, కేంద్ర జల ప్రాజెక్టుల సమన్వయం వంటి కీలక బాధ్యతలు ఎదురుకానున్నాయి.
ఇవి కూడా చదవండి
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్