సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం!
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:37 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సంస్కృత విద్యాపీఠం కోసం శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
రూ.54కోట్ల వ్యయంతో మూడంతస్తులతో రంగమండపం
హైవేపై కృష్ణశిలతో స్వాగత తోరణం
యాదగిరిగుట్ట పాలకమండలి నిర్ణయాలు
యాదాద్రి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సంస్కృత విద్యాపీఠం కోసం శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏల్) సీఎ్సఆర్ నిధులను వినియోగించేందుకు ఆ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకునేలా సమావేశం ఆమోదించినట్టు పాలకమండలి చైర్మన్ డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం కొండపై యాదగిరిగుట్ట దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సత్యనారాయణరెడ్డి వెల్లడించారు.
కొండ కింద ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో ఆధునిక విద్యాబోధన, వసతి సదుపాయాలతో సంస్కృత విద్యాపీఠానికి భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక ఆలయ మాడ వీధులకు అనుసంధానంగా లక్ష్మీనృసింహుల నిత్యకల్యాణ మండపం, స్వామివారి నృత్య, సంగీత, ధార్మిక కళానీరాజనాలకు వేదికగా రంగమండపం నిర్మాణాల డిజైన్లను ఆమోదించినట్లు తెలిపారు. రూ.54కోట్ల అంచనా వ్యయంతో మూడు అంతస్తులుగా నిర్మాణం చేపట్టే ఈ భవన సముదాయంలో మూడో అంతస్తులో స్వామివారి నిత్యకల్యాణ మండపం, రెండో అంతస్తులో సాహిత్య, సంగీత, నృత్య నీరాజనాలకు రంగ మండపం, మొదటి అంతస్తులో ప్రొటోకాల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ నెల 30న పనులు ప్రారంభించి, తొమ్మిది నుంచి 12నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్- వరంగల్ హైవేపై రాయిగిరి కృష్ణశిలతో అద్భుతమైన స్వాగత తోరణం నిర్మాణ పనులకు 30నే భూమిపూజ చేయనున్నట్టుగా పేర్కొన్నారు. కొండకింద పుష్కరిణి సమీపంలోని నిత్యాన్నప్రసాద సత్రం వద్ద భక్తుల కోసం షెడ్ నిర్మాణం, పాతగుట్ట ఆలయ పునరుద్ధరణ పనులను దాత సహకారంతో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్లే భక్తుల పాదరక్షల రుసుము వసూలుకు టెండర్ విధానాన్ని రద్దు చేసి, దేవస్థానమే ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కాగా హైదరాబాద్కు చెందిన శ్రీజనార్ధన సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో 28వ తేదీ నుంచి నవంబరు 1వ తేదీ వరకు తెలంగాణ వేదవిద్వాన్ మహాసభలు నిర్వహించనున్నట్లు చైర్మన్ డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు, భోజన వ్యయానికి రూ.13.66లక్షలు అనుమతిస్తూ సమావేశంలో ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేసినందున ఆలయ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా డీఏలు మంజూరు చేసేందుకు పాలకమండలి అనుమతించింది.
ఈ వార్తలు కూడా చదవండి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యకు ’గురూజీ‘ వల
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International