యాదాద్రికి ‘కార్తీక’ శోభ
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:15 AM
పవిత్ర కార్తీక పౌర్ణమికి 2 రోజుల ముందు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
1,901మంది సామూహిక వ్రత పూజలు
ఆదివారం ఒక్కరోజే స్వామి వారిని దర్శించుకున్న 80,400 మంది భక్తులు
రూ.59.51 లక్షల నిత్య ఆదాయం
యాదాద్రి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పవిత్ర కార్తీక పౌర్ణమికి 2 రోజుల ముందు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్త జనం.. ఆలయ మాడ వీధులు.. శివాలయం, వ్రత మండపాలు.. ఎక్కడ చూసినా భక్తుల సందడే.. సందడి. ఎక్కడికక్కడ భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపారాధనలూ వ్రత పూజలూ చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే 80,400 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని దేవాలయ అధికారులు ప్రకటించారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఆదివారం 1,901 మంది దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక వ్రత పూజలు ఆచరించారు. వివిధ కైంకర్యాల ద్వారా స్వామి వారికి రూ.59,51,025 ఆదాయం సమకూరినట్టుగా ఆలయ ఈవో జె.భవానీశంకర్ ప్రకటించారు. మరోవైపు, కార్తీకోత్సవాల్లో చివరి రోజు ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వారిలో భక్తి భావం పెంపొందించేలా సాగిన ఒడిస్సీ శాస్త్రీయ నృత్యం, తెలంగాణ ఆలయాల వైభవంపై ప్రత్యేక నృత్య రూపకం, పేరణి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను వేలాది మంది ఆసక్తిగా తిలకించారు. మరోవైపు, ఈనెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News