కార్మిక బీమాను పంచేసుకున్నారు!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:41 AM
భవన నిర్మాణ రంగ కార్మికులు మృతి చెందితే ఇచ్చే బీమా మొత్తాన్ని.. దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
అనర్హుల పేరిట నకిలీ బీమా క్లెయిమ్‌లు
ఒక్కో క్లెయిమ్‌తో రూ.1.30లక్షల మేర లబ్ధి
దళారులు, కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కు
ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 30పైగా క్లెయిమ్‌లు
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి
సూర్యాపేట, నవంబరు22(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ రంగ కార్మికులు మృతి చెందితే ఇచ్చే బీమా మొత్తాన్ని.. దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు కాని వారి పేరిట కూడా నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే బీమా డబ్బు కాజేశారు. కార్మిక శాఖ అధికారులు కూడా వారితో కుమ్కక్కై అందినకాడికి దండుకున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఈ అక్రమాలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. భవన నిర్మాణ కార్మికుడు సాధారణంగా మరణిస్తే రూ.1.30లక్షలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.6.30లక్షల చొప్పున ఆయా కుటుంబాలకు బీమా అందుతుంది. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 80మంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు కార్మికశాఖ వద్దకు వెళ్లగా.. 30 దరఖాస్తులకు రూ.1.30లక్షల చొప్పున కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మిగిలిన దరఖాస్తుల విషయంలో అధికారులకు అనుమానం వచ్చి.. పరిశీలన నిలిపివేశారు. వాటిని మరోసారి క్షేత్రస్థాయిలో విచారించాలని ఆదేశించగా.. అనర్హుల పేరిట నకిలీ క్లెయిమ్‌లు చేసినట్లు వెల్లడైంది. క్షేత్రస్థాయిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు, మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు, కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. మోతె మండలం హుస్సేనబాదకు చెందిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే కార్మికశాఖ కార్డును సృష్టించి అతడి పేరు మీద బీమా మొత్తాన్ని తీసుకున్నారు.
60 ఏళ్లపై బడిన వారు మరణిస్తే.. వారి వయస్సు 59లోపే ఉందంటూ నకిలీ రికార్డులు సృష్టించి.. బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. ఇందులో ఆయా కుటుంబాలకు రూ.30వేల చొప్పున ఇచ్చి.. దళారులు, అధికారులు రూ.లక్షను పంచుకున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 30 నకిలీ బీమా క్లెయిమ్ చేసినట్లు రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. ఇదే తరహాలో సూర్యాపేట, ఖమ్మం, మెదక్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, నిజామాబాద్, భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ నకిలీ బీమా క్లెయిమ్‌లు చేసినట్లు గుర్తించారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News