Share News

బీఆర్‌ఎస్‌ పార్టీ నిరర్ధక ఆస్తి

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:48 AM

ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నిరర్ధక ఆస్తి(నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్‌)గా మిగిలిపోయిందని తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ నిరర్ధక ఆస్తి
Kalvakuntla Kavitha

  • తొమ్మిది సర్వేలు చేసినా డిండికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పలేదు

  • ఏదుల నుంచి డిండికి నీళ్లు తెస్తామన్న సీఎం..

  • జిల్లాల మధ్య నీటి వివాదాలు సృష్టిస్తున్నారు: కల్వకుంట్ల కవిత

డిండి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నిరర్ధక ఆస్తి(నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్‌)గా మిగిలిపోయిందని తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సర్వేలు చేసిన బీఆర్‌ఎస్‌.. డిండి ఎత్తిపోతలకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలో చెప్పలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తెస్తామని చెప్పి.. జిల్లాల మధ్య నీటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టును శనివారం సందర్శించిన కవిత.. ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి నీరు తేవడం అంత సులువుకాదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.


ఎల్లూరు పంపుహౌస్‌ కోసం చేపట్టిన బ్లాస్టింగ్‌తో కల్వకుర్తి పంపుహౌ‌స్‌లో ఒక పంపు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం 0.6 టీఎంసీల కోసం మరో సోర్సు కోసం పంపుహౌస్‌ తవ్వితే కల్వకుర్తి, పాలమూరు పంపుహౌస్‌లకు ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఏదుల నుంచి డిండికి లింకు చేస్తామనడం, రెండు జిల్లాల ప్రజల మధ్య నీటి వివాదాలు సృష్టించడమేనని అన్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ నీటితో బస్వాపూర్‌ మీదుగా డిండి ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వడమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. లేదంటే బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి శివన్నగూడెం, కిష్టరాయన్‌పల్లి మీదుగా డిండికి నీటిని తరలించవచ్చని ప్రతిపాదించారు.


మూడో ప్రతిపాదనగా మల్లన్న సాగర్‌ నుంచి కొండపోచంపల్లికి అక్కడి నుంచి శామీర్‌పేట చెరువు, శివన్నగూడెంల నుంచి డిండి రిజర్వాయర్‌ను నింపవచ్చని సూచించారు. కృష్ణా జలాలను కాపాడుకునేందకు గతంలో బీఆర్‌ఎస్‌, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రయత్నించలేదని ఆరోపించారు. కాగా, ఎల్‌నినో నేపథ్యంలో ప్రతి ఎకరాకు రూ.25వేలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:48 AM