Share News

kumaram bheem asifabad- తుమ్మిడిహెట్టి పనుల్లో కదలిక

ABN , Publish Date - May 01 , 2026 | 10:36 PM

తుమ్మిడిహెట్టిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.బ్యారేజి నిర్మించి నేరుగా ఎల్లంపల్లికి గ్రావీటీతో జలాలను తరలించేందుకు యోచిస్తోంది

kumaram bheem asifabad- తుమ్మిడిహెట్టి పనుల్లో కదలిక
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది

- త్వరలో తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి

- ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

ఆసిఫాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టిపై బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 150 మీటర్ల ఎత్తుతో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.బ్యారేజి నిర్మించి నేరుగా ఎల్లంపల్లికి గ్రావీటీతో జలాలను తరలించేందుకు యోచిస్తోంది.బ్యారేజి నిర్మాణం పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. తుమ్మిడిహెట్టిపై బ్యారేజీ నిర్మాణా ప్రాంతాన్ని ఈనెల 7న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపద్యంలో శుక్రవారం తుమ్మిడిహెట్టి గ్రామంలోని బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ హరిత,జిల్లా ఎస్పీ నితికా పంత్‌,అదనపు కలెక్టర్‌ డేవిడ్‌,సబ్‌ కలెక్టర్‌ శ్రద్ద శుక్లా, ఎమ్మెల్సీ విఠల్‌లు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుండటంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

16.40 లక్షల ఎకరాలకు..

జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా 16.40 లక్షల ఎకరాలకు మెట్టసాగు అందించాలన్న లక్ష్యంతో రూ. 38,500 కోట్లతో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 20-11-2012లో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,56,500 ఎకరాలు, ఉమ్మడి కరీంనగర్‌లో 1,71,449 ఎకరాలు, ఉమ్మడి నిజామాబాద్‌లో 3,04,500 ఎకరాలు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 5,19,152 ఎకరాలు, ఉమ్మడి నల్గోండ జిల్లాలో 2,29,832 ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,29,704 ఎకరాలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11,863 ఎకరాలు మొత్తం 16.40 లక్షల ఎకరాలలో అయకట్టు ఉండేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ను రుపొందించారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ మరణం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విభజనతో పనులు ముందుకు సాగలేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టును కాదని ప్రాణహిత ప్రాజెక్టుకు బదులుగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మించింది. దీంతో ఈ ప్రాంతం నుంచి ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని పెద్ద ఎత్తున నిరసనలతో తమ డిమాండ్‌ను ఇక్కడి ప్రాంత వాసులు వినిపించారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహితకు ప్రత్యామ్నయంగా వరద నదిపై తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించింది. 152 మీటర్ల ఎత్తుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొవడంలేదని దీని ఎత్తును తగ్గించి 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించేందుకు తెలంగాణ-మహరాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకొవడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంపై మహరాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే తరువాయి అని బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అప్పట్లో హడవిడి చేసింది. తదనంతరం ఎన్నికలు సమీపించడం రాజకీయ పరిణామాలు చోటుచేసుకొవడంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమి పాలైంది. దీంతో ప్రాణహిత నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నది. .

రైతాంగంలో చిగురిస్తున్న ఆశలు..

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఉపడంతో ఈ ప్రాంత రైతాంగంలో ఆశలు మరోసారి చిగురిస్తున్నాయి. కోట్లడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఒట్టెత్తు పోకడలతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మణానికి నోచుకోలేదు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రాజెక్టు వద్ద ఒక తట్టమట్టి కూడ తీయలేదు. దీంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి కసరత్తు ముమ్మరం చేయడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని లక్షల ఎకరాలలో సాగునీరు అందనుంది. దీంతో ఈ ప్రాంతం పచ్చని పొలాలలో కళకళలాడనున్నాయి.

Updated Date - May 01 , 2026 | 10:36 PM