Share News

టమాట ధర ఢమాల్‌!

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:04 PM

ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పండించిన పంట చేతికి వచ్చే సరికి రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి.

టమాట ధర ఢమాల్‌!

  • కిలో ధర 4 రూపాయలే

  • జిల్లాలో 893 ఎకరాల్లో పంట సాగు

  • తెంపిన కూలీ డబ్బు కూడా రాని వైనం

  • పెట్టుబడి రాక నష్టపోయిన రైతులు

ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పండించిన పంట చేతికి వచ్చే సరికి రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి. ఒకప్పుడు కిలో వంద రూపాయల ధర పలికిన టమాట, నేడు కేవలం రూ. 4కే పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం కోత ఖర్చులకు కూడా డబ్బు రాక, పండించిన పంటను పొలాల్లోనే వదిలేసి, తిరిగి నాగలితో దున్నేయాల్సిన దుస్థితి నెలకొంది.

తొగుట(మెదక్): జిల్లాలోని గజ్వేల్‌, ములుగు, హుస్నాబాద్‌, దుబ్బాక, సిద్దిపేట, చేర్యాల వ్యవసాయ డివిజిన్‌ పరిధిలోని మండలాల్లో ఈ రబీలో 1466 మంది రైతులు 893 ఎకరాల్లో టమాట పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో వర్గల్‌ మండలంలో 255 ఎకరాలు, ములుగు(Mulugu) మండలంలో 257 ఎకరాలు, గజ్వేల్‌ మండలంలో 70 ఎకరాలు, నంగునూరు మండలంలో 63 ఎకరాలు, చిన్నకోడూరు మండలంలో 53.22 ఎకరాలు, మర్కూక్‌ మండలంలో 29.02 ఎకరాలు, సిద్దిపేట రూరల్‌ మండలంలో 26.04 ఎకరాలు, కొండపాక మండలంలో 24.06 ఎకరాలు, చేర్యాల మండలంలో 15.27 ఎకరాలు.


రాయపోల్‌ మండలంలో 15.28 ఎకరాలు, దౌల్తాబాద్‌ మండలంలో 15.11 ఎకరాలు, మిరుదొడ్డి మండలంలో 14.10 ఎకరాలు, జగదేవ్‌పూర్‌ మండలంలో 11.36 ఎకరాలల్లో పంట సాగుచేశారు. పంట సాగుకోసం రైతులు ఎకరాకు 70 నుంచి 80 వేల వరకు అందినకాడల్లా అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. కానీ పంట చేతికందే సమయంలో మార్కెట్‌లో ధరలేక పోవడంతో పెట్టుబడి వచ్చే పరిస్ధితి లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


srd1.jpg25 కిలోల టమాట బాక్స్‌కు మార్కెట్‌లో ధర రూ.100 చొప్పున పలుకుతుంది. గతంలో అదే బాక్స్‌కు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు ధర వచ్చేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట తెంపి అమ్మితే కూలీలకు సరిపడా డబ్బు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెంపిన పంటను మార్కెట్‌కు తరలించలేక పంటను చేలల్లోనే పారబోసి కలియదున్నుతున్నారు.


పెట్టుబడి కూడా రావడం లేదు

నీటిఎద్దడి ఉంటుందనే ఎకరా పొలంలో టమాట పంట సాగుచేశాను. పంట పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, మందులతో కలిపి రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంట చేతికందిన సమయంలో మార్కెట్‌లో కిలో ధర 4 రూపాయలు ఉండటంతో పంట తెంపిన కూలీ డబ్బు రావడం లేదు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

- తిప్పతి ఎల్లేశం, రైతు తిమ్మకపల్లి, రాయపోల్‌ మండలం


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 12:04 PM