సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:25 AM
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్రమంత్రి లేఖలో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ హామీల అమలుకు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఖజానా ఖాళీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ఇటీవల ఓ సభలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారని గుర్తుచేశారు. దీన్ని బట్టి చూస్తే.. ‘రాష్ట్ర ఖజానా నిల్.. పార్టీ నాయకుల జేబులు ఫుల్’గా ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
దాదాపు రూ.12 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి తెలంగాణ అభివృద్ధికి దాదాపు రూ.12 లక్షల కోట్లు మేర నిధులు కేటాయించిందని కేంద్రమంత్రి వివరించారు. ఇందులో పన్నుల వాటా రూ.2.5 లక్షల కోట్లు, రహదారులు రూ.1.85 లక్షల కోట్లు, రైల్వే బడ్జెట్ కేటాయింపులు రూ.36000 కోట్లకు పైగా, రైల్వే పనులకు మరో రూ. 50,000 కోట్లు, ఉపాధి హామీ రూ.40,000 కోట్లు, విద్యుత్ ప్రాజెక్టులు రూ.12,000 కోట్లు, పీఎం కిసాన్ నిధులు రూ.14,000 కోట్లు, ఉచిత రేషన్ రూ.50,000 కోట్లు, ఎరువుల సబ్సిడీ కోసం రూ.80,000 కోట్లు, విద్య.. క్రీడలకు రూ.21,000 కోట్లు, ఆరోగ్య సంరక్షణకు రూ.9,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో రైతుల నుంచి వరి సేకరణకు రూ.2.6 లక్షల కోట్లు, పత్తి సేకరణకు రూ.60,000 కోట్ల కనీస మద్దుత ధర చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక సంస్థల ద్వారా రూ.10 లక్షల కోట్ల ఋణాలు అందించారని చెప్పారు. ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్(SASCI) పథకం కింద వడ్డీ రహిత ఋణాలుగా రూ.10,000 కోట్లు పైగా ఇచ్చి మూలధన ప్రాజెక్టులకు సహకరించారని కేంద్రమంత్రి వివరించారు.
అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు...
ఈ నిధులతో మురుగునీటి నాళాలు, రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, మెడికల్- నర్సింగ్ కాలేజీలు, పాఠశాలలు, హాస్టళ్లు, పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓఆర్‌ఆర్ - ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణం, గోదావరి - మూసీ నది అనుసంధానం, మూసీ నది సుందరీకరణ, స్మార్ట్ సిటీ మిషన్‌లో రాష్ట్ర వాటా నిధులు, వరదల వలన పాడైపోయిన నిర్మాణాల పునరుద్ధరణ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రాష్ట్ర వాటా నిధులు వంటి అనేక ప్రాజెక్టులకు సాస్కి నిధులను ఖర్చు చేశారు. ముఖ్యంగా ఎంఎంటీఎస్ ఫేజ్ - II కోసం రూ.200 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం రూ.114 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కోసం రూ.315 కోట్లు, పీఎం గ్రామ సడక్ యోజన కోసం రూ. 674 కోట్లు, ఓఆర్‌ఆర్ - ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం రూ.200 కోట్లు, సిద్ధిపేట బైపాస్ రోడ్డు కోసం రూ. 110 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం రూ. 388 కోట్లు, పలు హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.300 కోట్లు వంటి ప్రాజెక్టులు ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
అన్నీ ఋణాలపైనే ఆధారం..
రాష్ట్ర ప్రభుత్వం.. జీతాలు, సంక్షేమ పథకాలు, రైతు భరోసా వంటి వాటికి కూడా ఋణాలపై ఆధారపడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్ర తలసరి అప్పు పెరుగుతోందన్నారు. 2014 లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితికి నేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్ధం పడుతోందని విమర్శించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే
బాధ్యతగా వన్యప్రాణి సంరక్షణ: డిప్యూటీ సీఎం పవన్
Read Latest Telangana News And Telugu News