Share News

ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:00 PM

ఆయిల్ పామ్ సాగు పెంచడానికి 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయిల్ పామ్ డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదని.. రైతులు ఆ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.

ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపండి.. రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, జులై 10: ఆయిల్ పామ్ సాగు పెంచడానికి 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదని.. రైతులు ఆ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు.


జిల్లాలో 50 వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పుడు 14 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతోందని మంత్రి తెలిపారు. ఒక్కో చిన్న గ్రామంలో 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు దాటిస్తే రూ.5 లక్షలు, పెద్ద గ్రామాల్లో 200 ఎకరాలపైన సాగు ప్రోత్సహిస్తే రూ.10 లక్షల అభివృద్ధి ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ఎల్‌నినో రాబోతోందని.. తీవ్ర కరవు కాటకాలు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మంత్రి తెలిపారు. దీంతో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా కోతుల బెడద ఉండదని.. వాతావరణ మార్పుల ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగం గురించి ఆలోచించే వారు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.


దేశానికి ఆయిల్ పామ్ అత్యవసరం: వివేక్

దేశానికి ఆయిల్ పామ్ అత్యవసరమని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. ఇరాన్ యుద్ధం వల్ల ధరలు పెరుగుతున్నాయని.. ఆయిల్ పామ్ దిగుమతి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని.. అందుకోసం సొంతంగా ఉత్పత్తి పెంచాలని కోరారు. గత సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ 25 శాతం అదనంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్‌కు పెద్దగా నీళ్లు అవసరం లేదన్నారు. చెన్నూరులో కూడా ఆయిల్ పామ్ సాగు వైపు చూస్తున్నారన్నారు ‘100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.5 లక్షలు ప్రోత్సాహకం ఇస్తే.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నేను కూడా రూ.5 లక్షలు ఇస్తాను’ అని మంత్రి వివేక్ ప్రకటించారు.



ఇవి కూడా చదవండి...

ఈనెల 20లోపు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వాల్సిందే: కవిత

నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు: ఎంపీ ఈటల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 01:11 PM