Share News

కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి.. తీసుకోండ్రి

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:09 AM

మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి(నగదు నిల్వలు), వాళ్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండ్రి.. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ దోచుకున్నదంతా ఈ ఎన్నికల్లో పంచిపెట్టుమనుండ్రి’ అంటూ పేర్కొన్నారు.

కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి.. తీసుకోండ్రి

  • పదేళ్లు దోచిందంతా బీఆర్‌ఎస్‌ వాళ్లను పంచుమనుండ్రి

  • ఎంపీ రఘునందన్‌

మెదక్‌: ’కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి(నగదు నిల్వలు), వాళ్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండ్రి.. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ దోచుకున్నదంతా ఈ ఎన్నికల్లో పంచిపెట్టుమనుండ్రి’ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు(Medak MP Raghunandan Rao) ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో కౌన్సిలర్లకు రోడ్లు, డ్రైనేజీ పనుల్లో కమీషన్లపై ఉన్న ధ్యాస పట్టణ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు.


గతంలో మంత్రి హరీశ్‌రావు మెదక్‌ను దత్తత తీసుకున్నారని గొప్పలు చెప్పుకున్నారని, కానీ సిద్దిపేట, గజ్వేల్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సౌకర్యం మెదక్‌కు ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. ఓట్ల కోసం వస్తే బీఆర్‌ఎస్‌ వారిని చెరువుల వద్దే సాగనంపాలని ప్రజలను కోరారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు కనీసం రోడ్లు, మురికి కాలువలు లేవని, అక్కడ దొంగతనాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.


raghu.jpgతాను ఎంపీగా గెలిచిన అతి తక్కువ కాలంలోనే దుండిగల్‌ నుండి మెదక్‌ వరకు జాతీయ రహదారి విస్తరణను మంజూరు చేయించానని, మెదక్‌కు 7.5 కిలోమీటర్ల రింగ్‌ రోడ్డును కూడా సాధించానని రఘునందన్‌రావు వివరించారు. అభివృద్ధి కావాలంటే నీతి నిజాయితీ గల బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్‌ మల్లేషంగౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి నర్సింహారెడ్డి, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్‌ పూర్తి నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2026 | 10:09 AM