Share News

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:50 AM

సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు కాంగ్రెస్‌కు ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

హుస్నాబాద్‌ అభివృద్ధే లక్ష్యం: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar

సిద్దిపేట, ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.. 3, 4, 15, 16 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన. ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. తనను ఒకసారి ఎంపీగా ఎన్నుకుని పంపితే.. తెలంగాణ కోసం గొడవపడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా ముఖ్యమంత్రి ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఈ ఊరు ముఖం తెలియని వ్యక్తి కూడా ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘నేను శాసనసభ్యుడిని.. నన్ను రారా, పోరా అంటున్నారు.. బిడ్డా! పొలిమేర కూడా దాటనివ్వను’ అని పొన్నం హెచ్చరించారు.


హుస్నాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు మంత్రి పొన్నం. సిద్దిపేట, వరంగల్‌ను మించి హుస్నాబాద్‌ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. పదేళ్ల క్రితం తమ హయాంలోనే శాతవాహన యూనివర్సిటీ వచ్చిందని.. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంజినీరింగ్, లా కాలేజీలు వచ్చాయని పేర్కొన్నారు. హుస్నాబాద్‌కు కరీంనగర్‌తో తల్లి పేగు సంబంధం ఉందని, దానిని బలవంతంగా సిద్దిపేటలో కలిపారని విమర్శించారు.


ఆనాడు సీఎం.. పీసీసీ హోదాలో హుస్నాబాద్‌ను మళ్లీ కరీంనగర్‌లో కలుపుతామని చెప్పారని, ఆ బాధ్యత తనదేనని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారని, కుర్చీలు వేసుకుని ఆ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఏడాది క్రితం హుస్నాబాద్‌కు వచ్చినవారు ఇప్పుడు చూస్తే 'ఇది మా హుస్నాబాదేనా' అనేలా మార్పు తెచ్చామని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ అభివృద్ధి కావాలనుకునే వారు.. కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి ప్రభాకర్ కోరారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 12:40 PM