కొండా సురేఖ అంశం.. ఆ రిపోర్టు వచ్చాకే నిర్ణయం: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:23 PM
మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్‌ను AICC, PCCకి అందజేశామన్నారు.
మెదక్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈరోజు(సోమవారం) మెదక్ హౌసింగ్ బోర్డులోని వినాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా PAC సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్‌ను AICC, PCCకి అందజేశామని.. డిటైల్డ్ రిపోర్ట్ వచ్చాక AICC పెద్దలు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి చెప్పుకునే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని మహేశ్ తెలిపారు. స్వేచ్ఛ హద్దులు దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని.. తనతో సహా అందరూ హద్దుల్లో ఉంటే మంచిదన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నట్టుగానే కాంగ్రెస్ కుటుంబంలో కూడా ఉంటాయన్నారు. ‘కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది.. ఇది సీఎం మాట, నా మాట, మీనాక్షి నటరాజన్ మాట. ఎవ్వరికీ కూడా 100 శాతం న్యాయం చేయలేం.. నేను వాస్తవాలు మాట్లాడతా. 70 శాతం పదవులు పాత కాంగ్రెస్ నాయకులకే దక్కేలా అధిష్ఠానం హామీ ఇచ్చింది. ములుగులో మంత్రి సీతక్క పాత నాయకులకే పదవులు ఇచ్చారు’ అని తెలిపారు.
సోషల్ మీడియాలో BRS, BJP పార్టీలు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మహేశ్ మండిపడ్డారు. సోషల్ మీడియాపై కేటీఆర్ ఆశలు పెట్టుకున్నారని.. కత్తి దూసినోడు కత్తికే చనిపోతాడు అన్నట్టు కేటీఆర్‌ను సోషల్ మీడియానే ఖతం చేస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్లు BRS చేసిన దోపిడీ, భూ దందా, అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. మల్లన్నసాగర్ కట్టేటప్పుడు ఎంతమందిపై కేసులు పెట్టి జైలుకి పంపారో జనాలు మర్చిపోలేదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మెదక్ ఎంపీ రఘునందన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న ఉద్యోగాలు తీసేసిన ఘనత ప్రధాని మోదీది అంటూ విరుచుకుపడ్డారు. మోదీ హవా తగ్గిందని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన ఇంటికి పోక తప్పదన్నారు. ప్రజలు 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలలో ప్రజాస్వామ్య తక్కువన్నారు. దళితుడు రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉంటే రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించారని, ఈటల రాజేందర్‌ను మెడ పట్టి గెంటేశారని మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
ఈగల్ శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో కలిసి
పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి
Read Latest Telangana News And Telugu News