ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్: హరీశ్ రావు
ABN , Publish Date - May 03 , 2026 | 03:21 PM
గత కొద్ది రోజులుగా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో రైతులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
సిద్దిపేట, మే 03: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం జిల్లాలోని మల్లారం వద్ద సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ జాతీయ రహదారిపై ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా హరీశ్ రావు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. 28 రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
పొద్దుతిరుగుడు, మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని గుర్తు చేశారు. వడ్లు పండించిన రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వడ్లు కొన్నట్లే.. ప్రస్తుతం కూడా వాటిని కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
కొనుగోలు సెంటర్లు ప్రారంభించినా.. ధాన్యం కొనుగోలు జరపడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వడ్లు కొనుగోలు కోసం ఆందోళన చేస్తున్న రైతులు వడదెబ్బ కారణంగా వరి కుప్పలపై చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డ కాదని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి
నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
For More TG News And Telugu News