Share News

రేవంత్.. కమీషన్ల కోసమే మూడేళ్లు సెలవు తీసుకోలేదా?: మాజీ మంత్రి హరీశ్ రావు

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:25 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని కొనసాగించడంలో విఫలమైందని ఆరోపించారు.

రేవంత్.. కమీషన్ల కోసమే మూడేళ్లు సెలవు తీసుకోలేదా?: మాజీ మంత్రి హరీశ్ రావు
Former Minister Harish Rao

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని కొనసాగించడంలో విఫలమైందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం శేఖర్‌రావుపేటలో వాటర్ ప్లాంట్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడంగల్, సిద్దిపేటలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి గత, ప్రస్తుత ప్రభుత్వాలను పోలుస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కొడంగల్‌లో తాను ఏం చేశానని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, కేసీఆర్ హయాంలో కొడంగల్‌లో రెండు 50 పడకల ఆస్పత్రులను నిర్మించామని తెలిపారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు తండాలకు రోడ్లు, 24 గంటల విద్యుత్ సరఫరా కల్పించామని పేర్కొన్నారు. చెరువులన్నింటినీ అభివృద్ధి చేశామని, ప్రతి మండలానికి ఒక గోదామును నిర్మించామని వివరించారు. అయితే, సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కీలక ప్రశ్నలు సంధించారు. సిద్దిపేటలోని వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించారని ఆయన ఆరోపించారు. రంగనాయక సాగర్ కాలువల పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను మూడేళ్లయినా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. వెయ్యి పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కూడా మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు.


మూడేళ్లలో ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ కష్టం ప్రజల కోసమా, లేక కమీషన్ల కోసమా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు నిధులు విడుదల చేశారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మూడు పంటలకు రైతుబంధు ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ బావుల వద్ద 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం 7 నుంచి 8 గంటలకే విద్యుత్ ఎందుకు పరిమితమవుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క

Updated Date - Nov 07 , 2026 | 08:27 PM