Share News

అదే నిజమైతే రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:05 PM

సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

అదే నిజమైతే రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్
Harish Rao

సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ‘సిగాచి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఛాలెంజ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, మరుసటి రోజు మాత్రమే సీఎం వచ్చారన్నారు. కంపెనీ రూ.25 లక్షలు ఇచ్చినా.. రేవంత్ ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.


అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను గుర్తుచేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. పెన్షన్‌ను 4 వేల రూపాయలకు పెంచుతామని బాండ్ పేపర్‌పై రాసిచ్చినా అమలు కాలేదన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం కేసీఆర్ ఇచ్చిన లక్షా 116 రూపాయల కంటే రేవంత్ తులం బంగారం అదనంగా ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. పురుషుల బస్సు ఛార్జీలను డబుల్ చేశారని విమర్శించారు. ఇస్నాపూర్‌లో గత రెండేళ్లలో గజం రోడ్డు కూడా వేయలేదని, చిన్న డ్రైనేజీ కూడా కట్టలేదన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలను కాపాడారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ లేని లోటు ఇప్పుడు అందరికీ తెలుస్తోందన్నారు. పనులు ఎవరు చేస్తారో గమనించి ఓటు వేయాలని హరీశ్ సూచించారు.


బీజేపీని కార్మికులు, పేదల వ్యతిరేక పార్టీ అని మాజీ మంత్రి విమర్శించారు. రేవంత్ సీఎం అన్న విషయాన్ని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని.. సీఎం మాట్లాడే భాష తగినది కాదన్నారు. కేసీఆర్‌ను బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను జైలుకు పంపాలని చెబుతున్నారని విమర్శించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ సీఎంగా, తాను మంత్రిగా వస్తానన్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో డబ్బులు పంచితే తీసుకోవాలని.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ప్రజలను మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు.


కాగా.. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పర్యటించిన హరీశ్ రావు.. అక్కడి మహిళలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. మహిళలతో ముచ్చటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ

మరో మూడు నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 03:48 PM