ఘాటెక్కిన మిర్చి ధర

ABN , First Publish Date - 2023-06-30T02:57:09+05:30 IST

రాష్ట్రంలో పచ్చిమిర్చి, టమాటా ధరలు ఆమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి ధర మరీ మండిపోతోంది.

ఘాటెక్కిన మిర్చి ధర

కిలో రూ.120, టమాటా 80పైనే

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చిమిర్చి, టమాటా ధరలు ఆమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి ధర మరీ మండిపోతోంది. అకాల వర్షాలు, ఎండల వల్ల దిగుబడి తగ్గి వీటి ధరలకు రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కిలో పచ్చిమిర్చి రూ.100, లావు రకం మిర్చి (బజ్జీ కాయలు) రూ.120 పలుకుతున్నాయి. కాస్త వర్షాలు పడి, మళ్లీ పచ్చిమిర్చి సాగు చేపడితే తప్ప.. ధర తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరో వైపు టమాటా గత వారం కిలో రూ.40-50 ఉండగా, ఈ వారం సెంచరీ కొట్టేసింది. నాణ్యమైన టమాటా రిటైల్‌గా రూ.100-120 పలుకుతోంది. కాస్త పండుబారిన, నాటు రకాల టమాటా కిలో రూ.80కి తక్కువ ఇవ్వట్లేదు. రాయలసీమలో నీటి తడులతో పండించే టమాటా చివరి దశలో మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు కాస్త తగ్గాల్సింది పోయి, ఆమాంతం పెరిగాయి. టమాటాకు ప్రసిద్ధి చెందిన మదనపల్లి మార్కెట్‌లో మొదటి రకం కిలో రూ.80దాకా పలుకుతోంది. దీంతో రవాణా చార్జీలు, కమిషన్లు కలిపి, రిటైల్‌ మార్కెట్‌లో రూ.100 అమ్ముతున్నారు. అయితే పండిపోయి, నాణ్యత తక్కువగా ఉన్న టమాటాలు మాత్రం రూ.80కే ఇస్తున్నారు. ఏపీతోపాటు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడులోనూ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రైతుబజార్లలో టమాటా కిలో రూ.70, పచ్చిమిర్చి రూ.90 చొప్పున అమ్ముతున్నా.. అవి నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. మంచి వర్షాలు కురిసి, కొత్త పంట వస్తేనే ధర తగ్గుతుందని చెప్తున్నారు.

Updated Date - 2023-06-30T02:57:09+05:30 IST