ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నావ్ రేవంత్: హరీశ్ రావు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:59 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. రేవంత్ ప్రారంభించబోయే అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ ఇచ్చిందని లేదని.. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించుకున్నవే అని తెలిపారు. శ్రమ ఫలితం మాది, శిలాఫలకాలు మీవా? అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, రేపు సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 365 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ..'సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించే ఆయిల్ ఫ్యాక్టరీ 2021లోనే ప్రారంభించాం. ఈ ఆయిల్ ఫామ్‌కి ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలి. కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. మొక్కవోని దీక్షతో పూర్తి చేసింది మేము. ఇప్పటికైనా కాళేశ్వరంపై చిల్లర మాటలు మానుకో. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడంలో అనేక విధాలుగా శ్రమ పడ్డాం. 20 కోట్ల లీటర్ల నీటి నిలువ సామర్థ్యం కలిగిన పాండ్ నిర్మించాం. మలేషియా టెక్నాలజీతో ఇండియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాం.
బీఆర్ఎస్ కృషి ఫలితమే ఆయిల్ ఫ్యాక్టరీ. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, రెండు పీహెచ్సీలు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా మంజూరు చేసి పూర్తి చేసినవి. వీటికి మీరు శిలాఫలకం వేసుకుని ప్రారంభిస్తున్నారు. ఇందులో మీరు చేసిందేమీ లేదు. మేము ఆలయాలు, విద్యాలయాలు, రిజర్వాయర్లు, జైళ్లు నిర్మించాం. రూ.78కోట్లతో 30 ఎకరాల్లో జిల్లా జైలు నిర్మించాం. కట్టించింది మేము, శిలాఫలకం మీరు వేసుకున్నారు. చేసుకో నాకేమీ ఈర్ష్య లేదు. కానీ శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది?. కనపడిన ప్రతి దేవుడు మీద ఒట్టుపెట్టి రుణమాఫీ అన్నారు.. అది ఇప్పటికీ కాలేదు. సిద్దిపేట జిల్లాలో 22వేల మంది రైతులకు రూ.300కోట్ల రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఒక నర్మేట్టలోనే 350మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయ్యింది 48 శాతం, కానిది 52 శాతం. మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. రేపు ఏ రైతు బంధు ఇస్తున్నారో రేవంత్ తెలపాలి.
పంటల బీమా రెండున్నర ఏళ్లుగా చేయలేదు. నష్టపోయిన రైతులకి ఒక్క రూపాయీ పరిహారం ఇవ్వలేదు. వడగళ్ల బాధిత రైతులకు నిధులు విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పనీ సిద్దిపేటకు ఇవ్వలేదు. సిద్దిపేటలో జరుగుతున్న రూ.1071 కోట్ల పనులనూ అర్థాంతరంగా రద్దు చేశారు. ఆ నిధులు వెంటనే పునరుద్ధరించాలి. ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ, రంగనాయకసాగర్ టూరిజం, శిల్పారామం, స్పోర్ట్స్ స్టేడియం ఇలా అనేక పనులు రద్దు చేశారు. వీటిలో కొన్నిటిని కొడంగల్‌కు రేవంత్ ఎత్తుకుపోయారు. ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు. మీరు రద్దు చేసిన గొప్పలు చెప్పుకోవడానికి వస్తున్నావా?' అంటూ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ బృందానికి చిక్కిన డ్రగ్ పెడ్లర్..
రెచ్చిపోయిన కామాంధుడు.. మతిస్థిమితం లేని బాలికలే టార్గెట్..!