కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరగాల్సిందే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 08:16 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగిపోవడంపై విచారణ జరగాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘ఆఫ్ ది రికార్డ్’ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 17: ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ‘ఆఫ్ ది రికార్డ్’ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తుల పెరిగిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ భూముల గురించిన వివరాలను చాలా లోతుగా సభ దృష్టికి తీసుకువచ్చారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 2004, 2009 ఎన్నికల అఫిడవిట్లలో కేసీఆర్‌కు భూములు లేవని పేర్కొన్నారని, కానీ 2014 నాటికి 35 ఎకరాలు, 2018లో మరింత పెరిగి, 2023 నాటికి 53 ఎకరాలు ఉన్నట్లు చూపించారని వివరించారు.
2023 నాటికి కేటీఆర్ కుటుంబ పేరిట 123 ఎకరాలు వచ్చాయని, 2026 నాటికి కేటీఆర్ 67 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. సమర్పించిన అఫిడవిట్లకు, అసలు ఆస్తులకు ఎక్కడా పొంతన లేదని, తెలంగాణలో గజం భూమి లేని పేదలు ఎందరో ఉండగా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబం వద్ద ఉన్న భూములపై కచ్చితంగా సమగ్ర విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. తాము వారిని బదనామ్ (ప్రతిష్ట దిగజార్చడం) చేయడానికి ఈ విషయాలు మాట్లాడటం లేదని, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలోని దళితులు, బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు.
జన్వాడ ఫామ్‌హౌస్ తనది కాదని కేటీఆర్ అంటున్నారని, కానీ ఆయన అక్కడే ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఎవరి ప్రైవేట్ ఆస్తులను లాక్కునే ఉద్దేశంతో లేదని స్పష్టం చేశారు.
22A నిషేధిత జాబితా విషయంలో ఎక్కడో ఒకచోట అధికారుల తప్పిదం ఉండి ఉండవచ్చని, దానిపై కూడా విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ నిబంధనను ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ తమ స్వార్థం కోసం పెట్టలేదని స్పష్టం చేశారు.
స్పీకర్ తల్లిపై బీఆర్ఎస్ నేతలు వాడిన భాష ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల పట్ల బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. గతంలో కేసీఆర్ ఢిల్లీలో ఉన్న ఇంటికి, ప్రగతి భవన్‌కు బుల్లెట్ ప్రూఫ్ తలుపులు ఏర్పాటు చేసుకున్న తీరును గుర్తుచేశారు.
అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని, గతంలో పనిచేసిన ఇంచార్జ్‌లు కూడా బాగానే పనిచేశారని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News