Share News

మళ్లీ అధికారంలోకి రావాలంటే.. సైనికుల్లా పని చేయాలి: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:47 PM

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావాలని బావా బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.

మళ్లీ అధికారంలోకి రావాలంటే.. సైనికుల్లా పని చేయాలి: టీపీసీసీ చీఫ్
TPCC Chief Mahesh Goud

నాగర్ కర్నూల్, ఏప్రిల్ 07: తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావాలని బావా బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం నాగర్ కర్నూల్‌‌లో కొత్తగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పేదలకు చేసింది ఏమి లేదన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు.


కాంగ్రెస్ పార్టీ గుండెకాయ గ్రామాల్లో ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండంటూ కేడర్‌కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పని చేసే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కేడర్‌కు స్పష్టం చేశారు. పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి.. లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. తన పాదయాత్రలో అన్ని విషయాలను తెలుసుకున్నారని వివరించారు. అందుకే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని పీసీసీ చీఫ్ తెలిపారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేశామని టీ పీసీసీ చీఫ్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఎన్ని నిధులు ఇచ్చారు? ఎన్ని నియామకాలు చేశారు? అంటూ ఆ పార్టీ నేతలకు టీ పీసీసీ చీఫ్ సూటిగా ప్రశ్నలు సంధించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేసి పోయిందని.. ఆ అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సావర్కర్, కార్యదర్శి వంశీ చంద్ రెడ్డితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్‌ పరిమితం: హరీశ్ రావు

Read Latest TG News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 05:07 PM