Share News

లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:07 PM

తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌‌కు కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష పడటంపై నటుడు కమల్‌హాసన్ తాజాగా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం దక్కడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, వ్యక్తిగతంగా మాత్రం తాను మరణశిక్షను వ్యతిరేకిస్తానని అన్నారు.

లాకప్ డెత్ కేసులో పోలీసులకు మరణశిక్ష.. కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
Kamal Haasan's View on Death Penalty

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఇటీవల మరణ శిక్ష విధించడంపై నటుడు కమల్‌హాసన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దోషులకు శిక్ష పడటాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే, వ్యక్తిగతంగా తాను మరణ శిక్షకు వ్యతిరేకమని చెప్పారు. ‘వ్యక్తిగతంగా నేను మరణ శిక్షను వ్యతిరేకిస్తాను. దారుణమైన నేరాలు చేసిన వారికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు విధించాలి’ అని కమల్ అన్నారు.

ప్రభుత్వ వ్యవస్థల్లో బాధ్యతాయుత వైఖరి పెరగాలని కూడా కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అధికారుల చర్యల్లో అనేక లోపాలు ఉన్నాయని కమల్‌హాసన్ అన్నారు. తండ్రీకొడుకుల మృతదేహాలను పరిశీలించకుండానే ప్రభుత్వ వైద్యుడు ఒకరు సర్టిఫికేట్ జారీ చేశారని చెప్పారు. ఈ కేసులో నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిన అధికారులనూ శిక్షించాలని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.


అధికారం తమను కాపాడుతుందన్న భావనలో ఉండే వారు ఎంతటి ప్రముఖులైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని చెప్పారు. ప్రజలను కాపాడాల్సిన వారే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దారుణమని అన్నారు. దోషులు తమ కుటుంబసభ్యులనూ ఇబ్బందుల పాలు చేశారని అన్నారు. ఈ కేసులో న్యాయం కోసం మృతుల కుటుంబసభ్యులు చేసిన పోరాటం, సామాజిక కార్యకర్తలు చూపిన చొరవ, సీబీఐ అధికారుల నిబద్ధత ప్రశంసనీయమని కామెంట్ చేశారు.

2020లో కొవిడ్ సమయంలో అనుమతించిన సమయానికి మించి షాపు తెరిచినందుకు అప్పట్లో పోలీసులు జయరాజ్, ఆయన తనయుడు బెనిక్స్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తరువాత ఇద్దరినీ కస్టడీలో ఇష్టారీతిన కొట్టడంతో తీవ్రగాయాలపాలైన తండ్రీకొడుకులు మరణించారు. ఈ కేసులో తాజాగా కోర్టు తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది.


ఈ వార్తలనూ చదవండి:

సీఎం భార్యపై పాస్‌పోర్ట్ ఆరోపణలు.. పవన్ ఖేడా ఇంటికి పోలీసులు

కేసీఆర్‌ను మార్చినట్లే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రేవంత్‌రెడ్డి

Updated Date - Apr 07 , 2026 | 03:55 PM