కేసీఆర్‌ను మార్చినట్లే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:50 AM
తెలంగాణలో కేసీఆర్‌ను మార్చినట్లే, కేరళంలో కూడా పినరయి విజయన్‌ను ప్రజలు మార్చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పినరయికి మోదీనే గాడ్‌ఫాదర్ అని, అన్ని కేసుల్లో కాపాడుతున్నారని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేరళంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని, ఈసారి కేరళంలో ‘స్టార్ క్యాంపెయినర్’గా నియమించారు. రేవంత్ రెడ్డి కేరళంలో విస్తృతంగా పర్యటిస్తూ, పలు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఏఎన్ఐతో మాట్లాడుతూ, 2014 - 2023 మధ్య పినరయి విజయన్ తనకు అందించిన లేఖలోని పలు విషయాలను ప్రస్తావించారు. ఆ సమయంలో పినరయి విజయన్ సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆయన లేఖలోని తప్పుల కారణంగానే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మార్చేశారని, ఇప్పుడు కేరళంలో కూడా పినరయి విజయన్‌ను ప్రజలు మార్చేస్తారని అన్నారు.
విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్ కేసులున్నాయని, అయితే పినరయికి మోదీనే గాడ్‌ఫాదర్ కావడంతో, ఈ కేసులన్నింటి నుంచి విజయన్‌ను రక్షిస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం తమ జీవితాలను, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని రకరకాల కేసులతో వేధిస్తున్నారని, కేజ్రీవాల్ సహా అనేక మంది నేతలను ఈడీ కేసులతో వేధించి అరెస్టు చేసిన వాళ్లు ఎందుకు విజయన్ జోలికి రావడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ.. విజయన్ మధ్య ఉన్న అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవని పేర్కొన్నారు. కేరళం ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని, ప్రభుత్వ మార్పు అవసరం స్పష్టమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రుల సమ్మె విరమణ
Read Latest News