వలస కార్మికులకు ఊరట.. 5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:43 AM
దేశంలో ఎల్‌పీజీ కొరతను అధిగమించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కేటాయించే 5 కిలోల చిన్న సిలిండర్ల సరఫరా కోటాను రెట్టింపు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5 కిలోల చిన్న ఎల్‌పీజీ సిలిండర్లకు ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ(FTL) సరఫరాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. రాష్ట్రాలకు కేటాయించే ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోటాను రెట్టింపు చేసింది. మార్చి 21 నాటి ఉత్తర్వుల్లోని 20 శాతం పరిమితిని సడలిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు గత నెల 2, 3 తేదీల్లో జరిగిన సగటు సరఫరా ఆధారంగా రెట్టింపు కోటా కేటాయించింది కేంద్రం. ఈ రకమైన సిలిండర్లను కేవలం వలస కార్మికులే అధికంగా వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిల్వ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సరఫరాల శాఖల ఆధీనంలో ఉండనున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(OMCs) సమన్వయంతో కార్మికులకు పంపిణీ చేయనున్నారు. వలస కూలీల ఇబ్బందులను తొలగించేందుకు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.
అయితే.. వినియోగదారులు చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలు చూపించడం ద్వారా సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ సిలిండర్లను తీసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి నివాస ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. దీంతో మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల సిలిండర్లు విక్రయించినట్లు కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4న ఒక్కరోజులోనే సుమారు 90వేల సిలిండర్లు అమ్ముడయ్యాయి. మరోవైపు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత నెల నుంచి ఇప్పటివరకు సుమారు 50 వేలకు పైగా నిల్వఉంచిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త టెస్ట్.. అందులో పాసైతేనే లెర్నింగ్, శాశ్వత లైసెన్స్
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్