Share News

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కొత్త టెస్ట్‌.. అందులో పాసైతేనే లెర్నింగ్‌, శాశ్వత లైసెన్స్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:53 AM

రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన లేకుండా వాహనాలు నడుపుతుండటం వల్ల జరుగుతున్నవే ఉంటున్నాయి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కొత్త టెస్ట్‌.. అందులో పాసైతేనే లెర్నింగ్‌, శాశ్వత లైసెన్స్‌

  • లెర్నింగ్‌ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్‌ పరీక్ష .. దాంట్లో పాసైతేనే లెర్నింగ్‌, శాశ్వత లైసెన్స్‌

  • ప్రస్తుత రెండంచెల విధానం స్థానంలో మూడంచెల విధానం!

  • రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణాశాఖ కసరత్తు

  • అధ్యయనానికి కమిటీ నియామకం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన లేకుండా వాహనాలు నడుపుతుండటం వల్ల జరుగుతున్నవే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య లక్షకుపైగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో, యాక్సిడెంట్ల నివారణకు వీలుగా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్సు జారీలో మూడంచెల విధానం అమల్లోకి తేవాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించేందుకు రవాణాశాఖలో వివిధ విభాగాల నుంచి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసారు. కమిటీ నివేదిక ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది. నివేదిక అందిన తర్వాత అన్ని అంశాల్ని పరిశీలించి వీలైనంత త్వరగా నూతన విధానం అమలు చేసేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇంటి నుంచే ఆన్‌లైన్‌ టెస్ట్‌కు హాజరుకావచ్చు

డ్రైవింగ్‌ లైసెన్సు జారీలో ప్రస్తుతం రెండంచెల విధానం అమల్లో ఉంది. తొలుత లెర్నర్స్‌ లైసెన్సు రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) పరీక్ష, ఆ తర్వాత ట్రాక్‌పై డ్రైవింగ్‌ పరీక్ష నిర్వహించి శాశ్వత లైసెన్సు మంజూరు చేస్తున్నారు. వీటికి తోడుగా కొత్తగా ఆన్‌లైన్‌ రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ మాడ్యూల్స్‌ టెస్ట్‌ పేరుతో మూడో దశను కూడా ప్రవేశపెట్టనున్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే... ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే ముందే.. ఆన్‌లైన్‌ రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ మాడ్యూల్‌ టెస్ట్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రహదారి భద్రతకు సంబంధించిన పలు అంశాలతో కూడి ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌ కాబట్టి.. ఇంటి నుంచే హాజరుకావచ్చు. దీనిలో పాసైతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత శాశ్వత లైసెన్సు తీసుకోవాలి. రోడ్‌ సేఫ్టీ అవేర్‌నెస్‌ మాడ్యూల్స్‌ టెస్ట్‌లో ఏయే అంశాలను చేర్చాలి, ఎంత సమయం ఆ పరీక్ష నిర్వహించాలి అన్నదానిపై అధ్యయనం జరుగుతోందని, కమిటీ నివేదిక తర్వాత స్పష్టత వస్తుందని రవాణాశాఖ అధికారులు తెలియజేశారు. రోడ్డు ప్రమాదం వల్ల జరిగే నష్టాలు, బాధిత కుటుంబాల ఆవేదన, వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై వీడియో క్లిప్పింగ్స్‌ చూపించి వాటి ఆధారంగా టెస్ట్‌ ఉండేలా చూస్తున్నామని ఒక అధికారి వెల్లడించారు.

Updated Date - Apr 07 , 2026 | 07:07 AM