ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:08 AM
'అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాజధాని' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 7: 'ఆంధ్రప్రదేశ్... ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు... ఇకపై అనిశ్చితిలో కూరుకుపోయిన భవిష్యత్తు కాదు' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది, భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, గౌరవ భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరుణంలో... ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరిందని తన ఎక్స్ సందేశంలో పవన్ పేర్కొన్నారు.
ఈ చారిత్రక ఘట్టం సాకారం కావడానికి కృషి చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్షణం.. త్యాగాలు చేసిన రైతులు, తమ సంకల్పం పట్ల ఏమాత్రం వెనుకంజ వేయకుండా నిలబడిన ప్రజలకు అంకితమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.