చురుగ్గా జమిలి, పౌరస్మృతి
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:57 AM
బీజేపీ కీలక ఎజెండాలైన ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికలను అమలు చేసే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
అమలు దిశగా ముందడుగు వేస్తాం
బీజేపీ 47వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
వాటిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : బీజేపీ కీలక ఎజెండాలైన ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికలను అమలు చేసే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయని, వాటిలో సానుకూల పురోగతి కూడా కనిపిస్తోందని చెప్పారు. బీజేపీ 47వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన సోమవారం వర్చువల్‌గా మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను 1994లోనే బీజేపీ లేవనెత్తిందని ప్రధాని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 2029లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ, ప్రతిపక్షాలపై దాడులు.. వంటి ఎన్నో అణచివేతలను బీజేపీ కార్యకర్తలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి బీజేపీ కట్టుబడి ఉందని వివరించారు. ‘‘బ్రిటీష్ కాలంనాటి వందలాది నల్ల చట్టాలను రద్దు చేశాం. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించుకొన్నాం.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాం.’’ అని తెలిపారు. ఇటువంటివి ఎన్నో బీజేపీ వల్లనే జరిగాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అసాధ్యమని చాలామంది వాదించారని... కాని రద్దు చేసి చూపించామని అన్నారు. గత ప్రభుత్వాల్లా కాకుండా.. దేశమే ప్రధానంగా బీజేపీ పాలన సాగిస్తోందని ప్రధాని చెప్పారు. బీజేపీ రాకతో దేశ రాజకీయాల్లో మార్పు వచ్చిందని... అధికారమే లక్ష్యంగా ఒకవైపు రాజకీయాలు సాగుతుండగా... సేవే లక్ష్యంగా మరోవైపు తమ రాజకీయాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఒక కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. అందుకు భిన్నంగా బీజేపీలో అందరికీ సమాన గౌరవం, ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీని కార్యకర్తలు తల్లిగా భావిస్తారని తెలిపారు. అందువల్లే పార్టీ వార్షికోత్సవం వారికి ఒక భావోద్వేగ అంశమన్నారు.