రూ.3 లక్షల బిల్లుకు లక్ష లంచం
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:39 AM
శిక్షణ సమయంలో క్రీడాకారులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు ఇవ్వడానికి లంచం అడిగిన అధికారి ఏసీబీకి చిక్కాడు.
వాలీబాల్ క్రీడాకారులకు భోజనం సరఫరా చేసిన
కాంట్రాక్టరును డిమాండ్ చేసిన అధికారి
ఏసీబీకి చిక్కిన మహబూబ్‌నగర్ డీవైఎస్‌వో
సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగి పైనా కేసు
మహబూబ్‌నగర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): శిక్షణ సమయంలో క్రీడాకారులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు ఇవ్వడానికి లంచం అడిగిన అధికారి ఏసీబీకి చిక్కాడు. రూ.3.10 లక్షలు విడుదల చేయడానికి రూ.లక్ష లంచం అడిగిన మహబూబ్‌నగర్ జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్‌వో) జక్కు రాజశేఖర్‌రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు దొరికాడు. మహబూబ్‌నగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్‌ఏటీజీ) హాస్టల్‌లో గత ఆగస్టులో వాలీబాల్ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.3.10 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు కోసం డివైఎస్ఓ జక్కు రాజశేఖర్ రెడ్డిని కాంట్రాక్టరు సంప్రదించాడు. ఆ క్యాటరింగ్ బిల్లు చెల్లించడానికి అనుమతి మంజూరు చేయడానికి రూ.లక్ష లంచం కావాలని జక్కు రాజశేఖర్ రెడ్డి, అతడి వద్ద పని చేస్తున్న కాంట్రాక్టు ఆపరేటర్ గోరె ఉమేశ్ డిమాండ్ చేశారు.
వారికి లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టరు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బు ఇస్తానని కాంట్రాక్టరు చెప్పడంతో మహబూబ్‌నగర్‌లోని క్లాక్ టవర్ చౌరస్తా వద్ద గల జీషాన్ హోటల్‌లో భోజనం చేద్దామని, అక్కడికే డబ్బు తెమ్మని బాధితుడికి రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. తదనుగుణంగా అక్కడికి వచ్చిన బాధితుడు ఆ హోటల్‌లో భోజనం చేస్తూనే.. డీవైఎ్‌సఓకు డబ్బు అందజేశాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు, రాజశేఖర్ రెడ్డి, గోరె ఉమేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్టేడియం మైదానంలోని డివైఎస్ఓ కార్యాలయానికి వచ్చి పంచనామా నిర్వహించారు. నిందితులిద్దరిని శుక్రవారం హైదరాబాద్ (నాంపల్లి) లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ మహబూబ్ నగర్ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News