జైపాల్‌రెడ్డి పేరుతో జిల్లా?
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:31 AM
దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అంశం రాజకీయ, పరిపాలన వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా కొత్త జిల్లాపై రెవెన్యూ వర్గాల్లో చర్చ
జనాభా ప్రాతిపదికన మిగతా జిల్లాల్లోనూ మార్పులు?
2027 మార్చి 31 వరకు సరిహద్దుల మార్పుపై ఆంక్షలు
ఆ తర్వాతే జ్యుడీషియల్ కమిషన్ ముందుకు వినతులు
హైదరాబాద్, నవంబరు5(ఆంధ్రజ్యోతి): దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు అంశం రాజకీయ, పరిపాలన వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఫ్యూచర్‌సిటీని కేంద్రంగా చేసుకుని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి, దానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలన్న ఆలోచనపై గతంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇటీవల కొన్ని ప్రాంతాలను ఇందులో కలిపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయన్న సమాచారంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే జనగణన కారణంగా 2027 మార్చి 31 వరకు పరిపాలనా సరిహద్దులు మార్చడానికి వీల్లేదు.
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణపై వచ్చిన వినతులను ఆ గడువు తర్వాతే జ్యుడీషియల్ కమిషన్‌కు పంపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో కొత్త జిల్లాపై ఆ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధులనే నాలుగు జిల్లాలుగా గుర్తించే ఆలోచన ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉండగా, ప్రభుత్వం వాటిని పునర్‌వ్యవస్థీకరించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్లుగా మార్చింది. ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల జోన్లు ఉన్నాయి. ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, కొత్తూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. జైపాల్‌రెడ్డి స్వగ్రామం మాడ్గుల కూడా ఇందులోనే ఉంది.
ఏ ప్రాంతాలు రావచ్చంటే
ప్రతిపాదిత జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఉండవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జైపాల్‌రెడ్డి స్వగ్రామం మాడ్గుల కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు ఉండగా, మహేశ్వరం మండలం నుంచి 28, కందుకూరు మండలం నుంచి 9 గ్రామాలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహేశ్వరం మండలం మొత్తాన్ని ఇందులో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.
సైబరాబాదే రంగారెడ్డి?
రంగారెడ్డి జిల్లాను కూడా పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధినే రంగారెడ్డి జిల్లాగా కొనసాగించే అవకాశాన్ని, ప్రస్తుత జిల్లాలోని కొన్ని మండలాలను కొత్త జిల్లాలో కలపడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్‌ను కొత్త మండల కేంద్రంగా చేసే ఆలోచన కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న పెద్దషాపూర్, కొత్తూరు ప్రాంతాలను ఫ్యూచర్‌సిటీ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.
అశాస్ర్తీయ విభజనను సరిదిద్దే యోచన
తెలంగాణ ఏర్పడినప్పుడు 10 జిల్లాలుండగా, 2016లో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయి. 2019లో ములుగు, నారాయణపేట ఏర్పాటుతో ఆ సంఖ్య 33కు చేరింది. గత ప్రభుత్వం జిల్లాలను అశాస్ర్తీయంగా విభజించిందని ముఖ్యమంత్రి తప్పుపడుతున్నారు. సమాన జనాభా ప్రాతిపదికన జిల్లాలు, మండలాలను పునర్ వ్యవస్థీకరించడమే లక్ష్యమని ఆయన ఇదివరకే చెప్పారు. ఇదే ప్రాతిపదికను నాలుగు కమిషనరేట్లకు వర్తింపజేస్తే వాటి మధ్య జనాభా వ్యత్యాసం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పోలీసు వెబ్‌సైట్ అంచనా ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 68 లక్షలు, మల్కాజ్‌గిరి పరిధిలో 42 లక్షలు, సైబరాబాద్ పరిధిలో 27 లక్షలు, ఫ్యూచర్ సిటీ పరిధిలో 25 నుంచి 30 లక్షల మంది జనాభా ఉన్నారు. సీఎం ప్రకటించిన కమిషన్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణను చేపట్టనుంది. జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే మిగతా జిల్లాల సరిహద్దుల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News