Share News

వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావు: కేటీఆర్

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:29 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తొలిసారి స్పందించారు.

వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావు: కేటీఆర్

  • కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం.. వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావు

  • జైలుకు వెళ్తే సీఎం అవుతామనుకోవడం భ్రమ.. పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి నష్టపోయాం

  • మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం.. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబు, కేసీఆర్‌ గొప్ప సీఎంలు

  • గతంలో తప్పులు చేశాం.. సరిదిద్దుకుంటాం.. కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం

  • 2027లో పాదయాత్ర చేపడతా.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ వ్యాఖ్యలు

మంచిర్యాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. రాజకీయ పార్టీని ఎవరైనా పెట్టవచ్చునని, అయితే పదవుల కోసం, వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావన్నారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు గానీ.. ఏడిపించవద్దని వ్యాఖ్యానించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్‌.. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ పెడుతున్న అంశంపై స్పందిస్తూ.. అది ఆమె వ్యక్తిగతమన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు. కానీ, ప్రజలు ఓట్లు వేయాలి కదా! వ్యక్తిగత బాధలు చూపిస్తే ప్రజలు నమ్మరు కదా! ఒకరిద్దరు వ్యక్తులు జైలుకు వెళ్లొచ్చి ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన.. మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటు. జైలుకెళ్తే సీఎం అవుతారనుకోవడం భ్రమ’’ అని కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబు, కేసీఆర్‌ రాష్ట్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని, వారి స్ఫూర్తితో తాము ముందుకెళతామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ రాజకీయంగా నష్టపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం కేసీఆర్‌దేనన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ అనే పేరు ప్రస్తుతం ఖాళీగా ఉందని, ఎవరైనా దానిని పెట్టుకోవచ్చని కవిత ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తమ కుటుంబంలో ఎలాంటి పదవుల గొడవలు లేవని కేటీఆర్‌ అన్నారు.


గతంలో తాము చిన్న చిన్న తప్పులు చేశామని, ఆ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. టీడీపీలో నాయకులు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారని, బీఆర్‌ఎస్‌లో అది లోపించడం వల్లే ఓడిపోయామని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేశామని, ఇకపై కార్యకర్తలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తూ.. వారికి తాము కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయి ఉండవచ్చునని, అన్నీ చేశామని కూడా తాము చెప్పడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై తాను 2027లో పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ ప్రకటించారు. పదేళ్ల కాలంలో పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, దానిని తగ్గించేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని లోపాలను కేసీఆర్‌ బహిరంగంగానే అంగీకరించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ’గల్ఫ్‌ పాలసీ’ని తీసుకురాలేకపోయామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఇలాంటి లోపాలు తలెత్తాయన్నారు.

రాష్ట్రంలో దోచుకో.. దాచుకో పథకం!

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో దోచుకో.. దాచుకో పథకం మాత్రమే నడుస్తోందని కేటీఆర్‌ అన్నారు. అందుకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లో కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. టెండర్లలో సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకొని సృజన్‌రెడ్డి రూ.వేల కోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము ఇచ్చిన 16వేల వారసత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్‌ ఏసీబీ విచారణ జరుపుతామంటోందని, ముందుగా సీఎం బావమరిది మీద ఎంక్వైరీలు వేయాలని డిమాండ్‌ చేశారు.

డీలిమిటేషన్‌కు అభ్యంతరాలుండవు: కేటీఆర్‌

డీలిమిటేషన్‌ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని, దీంతో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ప్రస్తుతం ఉన్న నిష్పత్తి ప్రకారం డీలిమిటేషన్‌ చేపడితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవన్నారు. పార్లమెంటులో ప్రస్తుతం ఎంపీ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం వాటా ఉందని, ఇకపైనా ఈ శాతం తగ్గకుండా డీలిమిటేషన్‌ చేపట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేయబోమని, బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. పొత్తులు తమకు కలిసిరావన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 06:45 AM