పది రోజులు మృత్యువుతో పోరాడి.. చికిత్స పొందుతూ మహిళా కండక్టర్ మృతి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:09 AM
చిల్లర డబ్బుల విషయమై ఓ ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసేసిన ఘటనలో తీవ్రంగా గాయపడి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన మహిళా కండక్టర్ మంగళవారం రాత్రి మృతి చెందింది.
మణుగూరు/అశ్వాపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): చిల్లర డబ్బుల విషయమై ఓ ప్రయాణికురాలు బస్సులో నుంచి తోసేసిన ఘటనలో తీవ్రంగా గాయపడి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన మహిళా కండక్టర్ మంగళవారం రాత్రి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన గుండ్ల ప్రవళిక (24)కు.. ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసిన తండ్రి నాగరాజు చనిపోవడంతో వారసత్వంగా పదినెలల కిందట కండక్టర్ ఉద్యోగం వచ్చింది. మణుగూరు డిపోలో పనిచేస్తోంది. మరో రెండు నెలల్లో ప్రవళికకు వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతనెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్లే సర్వీసులో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అశ్వాపురం మండలం పిచికలతండాకు చెందిన ప్రమాణికురాలు బానోత్ మౌనిక, కండక్టర్ మధ్య టికెట్ విషయంలో గొడవ జరిగింది.
మౌనిక తన కుమారుడి టికెట్ చార్జీ నిమిత్తం రూ.100ఇవ్వగా చిల్లర కోసం కండక్టర్ ప్రవళికతో గొడవపడి ఘర్షణకు దిగి దుర్భాషలాడింది. ఈ క్రమంలోనే మిట్టగూడెం సెంటర్ వద్దకు చేరుకున్న సమయంలో ఆ ప్రయాణికురాలు.. ప్రవళికను బస్సులో నుంచి కిందకు తోసేసింది. దాంతో ప్రవళిక కిందపడగా.. బస్సు వెనుక చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ఆస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రవళిక చివరకు మంగళవారం రాత్రి మృతి చెందింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News