‘సీతారామ’పై సూర్య వెలుగులు
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:49 AM
సీతారామ ఎత్తిపోతల పథకానికి విద్యుత్ ఖర్చు గుదిబండలా మారుతోంది. గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ఉమ్మడి ఖమ్మం, మహబూబాద్ జిల్లాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఈ ప్రాజెక్టుకు కరెంటు బిల్లుల రూపంలో భారీ వ్యయం తప్పడం లేదు.
ప్రాజెక్టుపై విద్యుత్ బిల్లుల మోత..
5నెలలో రూ.105కోట్ల భారం
భారం తగ్గించేలా సోలార్ ప్లాంట్ల ప్రణాళిక
రెడ్కోకు లేఖ రాసిన నీటి పారుదల శాఖ
100మెగావాట్లతో 15 కోట్ల
యూనిట్ల విద్యుత్ ఉత్పతికి అవకాశం!
కొత్తగూడెం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకానికి విద్యుత్ ఖర్చు గుదిబండలా మారుతోంది. గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ఉమ్మడి ఖమ్మం, మహబూబాద్ జిల్లాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఈ ప్రాజెక్టుకు కరెంటు బిల్లుల రూపంలో భారీ వ్యయం తప్పడం లేదు. ఎల్‌నినోతో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, గత జూన్ నుంచి డిసెంబర్ వరకు ఐదు నెలల వ్యవధిలో ఒకే మోటారుతో 1,604 గంటల పాటు దాదాపు 9.008టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికోసం ఏకంగా 150 నుంచి 160 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, రూ.105కోట్ల విద్యుత్ బిల్లు రావడం ప్రాజెక్టు నిర్వహణ భారానికి అద్దం పడుతోంది.
ఈ ఆర్థిక భారాన్ని నివారించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా, సీతారామ ప్రధాన, ఉప కాలువలపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యయాన్ని తగ్గించాలని ప్రణాళిక రచించింది. కాలువలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఎంత మేర సాధ్యమవుతాయి.. ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంశాలపై అధ్యయనం చేయాలని కోరుతూ తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్థి సంస్థ (టీజీ రెడ్కో)కు ప్రతిపాదనలు పంపింది.
కాలువల పైనే ప్లాంట్లు..
సీతారామ కాలువలు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి నుంచి మొదలుకుని సుమారు 372 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రధాన కాలువ సుమారు 35 నుంచి 45 మీటర్ల వెడల్పు ఉండగా.. ఉప కాలువలు 15 నుంచి 25 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఆయా కాల్వలపైనే సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ భూములను సేకరించాల్సిన అవసరం తగ్గుతుందని, పైగా నీటిపై నేరుగా ఎండ పడకుండా ఉండటం ద్వారా నీటి ఆవిరి నష్టాన్ని కొంతమేర అరికట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సాధారణంగా ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సగటున 15 నుంచి 15.5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన 100 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేస్తే సుమారు 15 కోట్ల యూనిట్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి వినియోగించుకోవడం వల్ల ప్రాజెక్టు నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గనుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
గ్రూప్-1 ఆఫీసర్లుగా ఉపాధి కూలీ పిల్లలు
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News