Share News

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:06 PM

ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(48)ని ఈనెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో బొగ్గుల శ్రీనివాస్‌ని కారుతో సహా పడేశారు. ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు..

బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో సంచలన విషయాలు..
Writer Boggula Srinivas Case

ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్(48)ని (Writer Boggula Srinivas Case) ఈనెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో కారుతో సహా పడేశారు. ఈ విషయంపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు జరిపారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ (ఆదివారం) నిర్వహించిన మీడియా సమావేశంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మొదట ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోలీసుల సమగ్ర దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్.. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. జీఎస్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు ప్రధాన కారణమని ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. మొదట ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన వెనుక కుట్ర ఉందనే అనుమానం వచ్చిందన్నారు. మృతదేహంపై గాయాలు, కారులో రక్తపు మరకలు, సంఘటనా స్థలంలో లభించిన ఇతర ఆధారాలు కేసును ఛేదించేందుకు సహకరించాయని చెప్పారు.


ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు..

బొగ్గుల శ్రీనివాస్‌కు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ లావాదేవీల్లో పెండింగ్‌లో ఉన్న డబ్బుల విషయమై కొందరు వ్యక్తులతో ఆయనకు విభేదాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని నిందితులు హత్యకు పథకం రచించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా మేకల వేణుమాధవరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. బొగ్గుల శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా ఉన్న అతడు రూ.5 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురు వ్యక్తులతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.


పథకం ప్రకారం హత్య..

పోలీసుల కథనం మేరకు.. పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇస్తామని నమ్మబలికి శ్రీనివాస్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రదేశంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో జీఎస్టీకి సంబంధించిన ఆర్థిక వివాదాలే హత్యకు దారి తీసినట్లు తేలింది. పెండింగ్‌లో ఉన్న డబ్బుల వ్యవహారం, వ్యాపార ఒత్తిడి, పరస్పర అనుమానాలు.. చివరకు ఈ దారుణానికి దారి తీసినట్లు పేర్కొన్నారు. నిందితులు ముందుగానే హత్యకు ప్రణాళిక రచించి, శ్రీనివాస్‌ను ఒంటరిగా కారులో తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు.


కుటుంబ సభ్యులకు అనుమానాలు..

ఈ ఘటన ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున నకిరేకల్ సమీపంలో జరిగినట్లు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని కారుతో పాటు పాలేరు రిజర్వాయర్‌లో పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కారును నీటిలోకి తోసేసి, అది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అయితే, మృతదేహంపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి దర్యాప్తు జరిపారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను పరిశీలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపినప్పుడు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.


రిమాండ్‌కు నిందితులు..

పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైతే అదనపు వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. జీఎస్టీ లావాదేవీలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆర్థిక వివాదాల నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం, వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చితే ఎలాంటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 03:40 PM