Share News

కొట్టుకుపోయిన పంటలు.. పొలాల్లో ఇసుక మేటలు!

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:54 AM

మురసు తుఫాను ఏపీకి సరిహద్దున ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

కొట్టుకుపోయిన పంటలు.. పొలాల్లో ఇసుక మేటలు!
Bhadradri Kothagudem Floods

  • వరద ఉధృతిలో వ్యవసాయ మోటార్లు పోయాయి

  • ‘మురసు’తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం

  • సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

కొత్తగూడెం (ఆంధ్రజ్యోతి)/ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), నవంబరు 5: మురసు తుఫాను ఏపీకి సరిహద్దున ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, చండ్రుగొండ, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కన్నాయిగూడెం నుంచి పెదవాగు ప్రాజెక్టు వరకు గల వాగుల వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న దాదాపు 100 వ్యవసాయ మోటార్లు, పొలాల్లో వేసిన డ్రిప్పు, ఇతర పరికరాలు వరదలకు కొట్టుకుపోయాయి.


నష్టం అంచనాకు వివిధ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. గురువారం సర్వే ముగిసే సమయానికి జిల్లావ్యాప్తంగా 11,091 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు, వైరా కొణిజర్ల, రఘునాధపాలెం, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లాలో 20,450 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అనధికారికంగా జిల్లాలో 25 వేల ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి, మరో 5 వేల ఎకరాల్లో మిర్చి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దెబ్బతిన్న పంటలు, రహదారులు, కల్వర్టులు, వంతెనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.


రూ.20 లక్షల నష్టం వాటిల్లింది

వరదలతో ఊహించని విధంగా నాకు నష్టం జరిగింది. ఐదేసి చొప్పున ఎకరాల్లో వరి, మిర్చి, మరో పది ఎకరాల్లో మినుము పంట పెద్దవాగు వరదలో కొట్టుకుపోయాయి. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం జరిగింది. కళ్ల ముందే పంటలు కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేకపోయాం.

- శెట్టిపల్లి కృష్ణారెడ్డి,

కొత్తూరు, అశ్వారావుపేట మండలం

కాకరతోట ఆనవాళ్లు లేకుండాపోయింది

మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని కాకర తోట వేశా. వరదలకు ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోయింది. డ్రిప్‌ సామాన్లు కూడా పోగా పొలమంతా రాళ్లతో నిండిపోయింది. రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

- కే రామారావు,

నారంవారిగూడెం, అశ్వారావుపేట మండలం


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 04:54 AM