సింగరేణి డిమాండ్లపై ఈనెల 20 నుంచి నిరవధిక దీక్ష: కవిత
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:21 PM
సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణిపై పెను భారం పడుతోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జులై 9: సింగరేణి బాయి బాటలో భాగంగా కార్మికులతో మమేకమవుతున్నట్లు టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణిపై పెను భారం పడుతోందన్నారు. సింగరేణిలో ఆర్థిక సంక్షోభంతో పని ముట్లు కొనలేని దుస్థితి నెలకొందన్నారు. అధికారులకు ఓ రూల్, కార్మికులకు మరో రూల్‌లా యాజమాన్యం తీరు ఉందని మండిపడ్డారు.
తెలంగాణ హక్కుగా ఉన్న బొగ్గు బ్లాక్‌లు కేంద్రంలోని బీజేపీ వైఖరి వల్ల ప్రైవేట్‌పరం అవుతున్నాయని కవిత విమర్శించారు. తెలంగాణ రాకముందు 62 వేల రెగ్యులర్ కార్మికుల సంఖ్య ఉండేదని.. నేడు 38 వేలకు తగ్గిందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలలో రెండు సార్లు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డ్ ద్వారా వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం డిపెండెంట్లపై స్పష్టత ఇవ్వకపోతే ఈనెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు.. వివరణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్ చీఫ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అకౌంట్‌లో ఉన్న రూ.1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని.. ఆ నిధులపై విచారణ జరిపి ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి...
బస్ కోసం వేచి చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన బొలెరో
పెట్టుబడుల పేరుతో మోసం.. ఫిఫా ప్రసార హక్కుల సంస్థకు రూ.2 కోట్ల టోకరా
Read Latest Telangana News And Telugu News