నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:06 AM
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో మంగళవారం నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి(18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
ప్రేమించాలంటూ వేధించిన యువకుడే హత్య చేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు
జూలూరుపాడు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో మంగళవారం నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి(18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటివరకు ఇంట్లోనే ఉన్న ఆ యువతి సాయంత్రం వేళ తల్లి బయటకు వెళ్లి వచ్చే సమయానికి ఒళ్లంతా గాయాలతో ఇంటి మరుగుదొడ్డి వెనుకభాగంలో విగతజీవిగా పడి ఉంది. విద్యార్థిని ముక్కులో నుంచి రక్తం రావడం, మెడ నులిమిన ఆనవాళ్లు ఉండటంతో హత్య చేసినట్టుగా భావించిన మృతురాలి తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించాలంటూ తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్ వేధించాడని, పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని గతంలో బెదిరించాడని ఆమె గుర్తు చేశారు. పవన్‌కుమారే హత్యకు పాల్పడి ఉంటాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబానికి మంత్రి తుమ్మల భరోసా
న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు జూలూరుపాడు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకుని మంత్రి తుమ్మల వారి వద్దకు వచ్చారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజుతో ఫోన్‌లో మాట్లాడి మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును కొనసాగించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లోగా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సూచించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపిస్తానని మంత్రి హమీ ఇవ్వడంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిద్దిపేటలో పేకాట మాజీ ఎమ్మెల్సీ సహా నలుగురి అరెస్టు
గాంధీ ఆస్పత్రి చిన్న పిల్లల వార్డులో.. వెంటిలేటర్ కావాలంటే క్యూ కట్టాల్సిందే!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News