Share News

కరీంనగర్‌లో దారుణం.. కవల పిల్లలను బావిలో తోసేసిన తండ్రి..

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:43 PM

కరీంనగర్ జూబ్లీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

కరీంనగర్‌లో దారుణం.. కవల పిల్లలను బావిలో తోసేసిన తండ్రి..
Karimnagar Tragedy

కరీంనగర్: జూబ్లీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కాని వారి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు శ్రీశైలం. ఇద్దరు చిన్నారులను బావి వద్దకు తీసుకెళ్లాడు. వారు ఎంత ఏడుస్తున్నా కనికరం లేకుండా అందులోకి తోసేశాడు. బాలికలిద్దరూ బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఈత రాకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.


కాపాడాలని తండ్రిని వేడుకుంటూ ఆర్తనాదాలు పెట్టారు. చివరికి ప్రాణాలు విడిచారు. అయితే, వారిని బావిలోకి తోసేసిన అనంతరం శ్రీశైలం అక్కడ్నుంచి పరారైనట్లు తెలుస్తోంది. పిల్లలు ఏరంటూ ఇంటికి వచ్చిన భర్త శ్రీశైలాన్ని భార్య ప్రశ్నించగా నీళ్లునమిలాడు. అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించగా తనకు తెలియదంటూ దాట వేసే ప్రయత్నం చేశాడు. చిన్నారుల కోసం ఎంత వెతికినా జాడ తెలియకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఓ బావిలో గీతానిశి, గీతాన్విక మృతదేహాలను గుర్తించారు.


జీవచ్ఛవాలుగా పడి ఉన్న కూతుళ్లను చూసి బాధిత తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. శ్రీశైలాన్ని పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఆడుకుంటూ బావిలో పడ్డారని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, భార్యాభర్తల మధ్య కలహాలే చిన్నారుల మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, కవలల మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

Updated Date - Apr 03 , 2026 | 09:50 PM