Share News

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:38 PM

కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరం ఉందని అన్నారు.

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Union Minister Kishan Reddy

హైదరాబాద్: కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరం ఉందని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు తెలంగాణలో పూర్తిగా విఫలమయ్యాయని.. ఒక్క పథకం కూడా సమర్థవంతంగా అమలు కాలేదన్నారు. అమలు చేయని పథకాలను అమలు చేసినట్టు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇది సాధారణ అబద్ధం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రయత్నమని కిషన్ రెడ్డి ఆగ్రహించారు.


ఆరు గ్యారెంటీలు అటకెక్కాయి..!

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..'మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా?. పెన్షన్లు రూ.2,000 నుంచి రూ.4,000 చేస్తామని, దివ్యాంగులకు రూ.3,000 నుంచి రూ.6,000 చేస్తామని చెప్పారు, అమలు చేశారా?. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇచ్చారా?. బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారు.. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క ఏడాది కూడా రూ.20 వేల కోట్లు ఇవ్వలేకపోయారు. ఇవన్నీ కేరళ ప్రజలకు చెప్పగలరా?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోవడం మోసమైతే.. అమలు చేశామని చెప్పడం మరింత పెద్ద మోసం. తప్పుడు ప్రచారం, అబద్ధాలు చెప్పడం ప్రజలను దగా చేయడమే.


ఉచిత స్కూటర్లు ఎక్కడ?

తెలంగాణలో పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ?. ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కడ?. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?. నిరుద్యోగ బృతి ఎక్కడ?. ఈ హామీలన్నీ ఎక్కడికి పోయాయి?. ఇవన్నీ చేయకపోయినా.. గ్యారెంటీలు అమలు చేశామని కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పడం ఎంత పెద్ద మోసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ మాటలను నమ్మకండి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కేరళం ప్రజలను మోసం చేశాయి. గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిని అడ్డుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అవినీతి మరింత పెరుగుతుంది. రేవంత్ రెడ్డి మాటలకు కేరళంలో విలువ లేదు. ఆయన ఎందుకు అక్కడికి వెళ్లారో అందరికీ తెలుసు. తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. అందుకే ఆ పార్టీ నాయకులను అక్కడికి పిలుస్తున్నారు. ఉపన్యాసాలు ఇవ్వమని పిలుస్తున్నారు కానీ ఓట్లు మాత్రం పడవు.


కేసీఆర్ హామీలు అమలు చేయలేదు..

సీఎం రేవంత్ రెడ్డివి మోసం చేసే రాజకీయాలు. గతంలో కేసీఆర్ ఎలా హామీలు ఇచ్చి అమలు చేయలేదో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. అమలు చేయకపోయినా 'చేశామని అనుకోండి' అనే ధోరణి ప్రమాదకరం. 2014కి ముందు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం ముంపు ప్రాంతాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే జరిగాయి. దీనికి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ విషయంలో మేము పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మేడిగడ్డ లేదా కొన్ని పిల్లర్ల విషయంపై మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు మొత్తంగా సీబీఐ విచారణకు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో ఉంది. పూర్తి నిజాలు బయటకు రావాలి.


కాంగ్రెస్‌దే బాధ్యత..

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడతామన్నారు. జైలుకు పంపుతామని, రూ.లక్ష కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్క కేసులోనూ చర్యలు తీసుకోలేదు. మరి ఆ ఆరోపణలు ఏమయ్యాయి?, దర్యాప్తు ఎక్కడికి పోయింది?. ఇప్పుడు తమ అసమర్థతను దాచుకోవడానికి బీజేపీపై నెపం వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీగా బాధ్యత కాంగ్రెస్‌దే. వేరే వాళ్లపై నెట్టడం కాదు, తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. అమలు చేయాల్సిన ప్రజాస్వామ్య బాధ్యతా ఆ ప్రభుత్వానిదే' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

Updated Date - Apr 03 , 2026 | 07:47 PM