హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం
ABN , Publish Date - Mar 16 , 2026 | 10:36 AM
జగిత్యాలలోని ఓ ప్రైవేటు స్కూల్ ఎదుట హనుమాన్ స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జగిత్యాల జిల్లా, మార్చి 16: జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ముందు హనుమాన్ స్వాములు ధర్నాకు దిగారు. హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించకుండా స్కూల్ యాజమాన్యం అడ్డుకుంది. పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని మేనేజ్‌మెంట్ తెలిపింది. హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులకు 21 రోజుల పాటు పాఠశాలకు రావడానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్ ఎదుట బైఠాయించి హనుమాన్ స్వాములు నిరసన తెలిపారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన హనుమాన్ స్వాములు పాఠశాలలోని కొన్ని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం
Read Latest Telangana News And Telugu News