Share News

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:54 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

  • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు

  • పరీక్షలు రాసే విద్యార్థులు 6,40,916 మంది

  • రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

  • డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ ఉన్నా అనుమతి

  • హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • 8.45 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

  • తప్పనిసరి పరిస్థితుల్లో 10 గంటల వరకు అనుమతి

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది పరీక్షలు రాయనుండగా.. వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,22,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. బాలురు 3,28,652, బాలికలు 3,12,264. రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38,958 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. సమస్యాత్మకంగా గుర్తించిన 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఉదయం 8.45 గంటల్లోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 10 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 10 తర్వాత ఎవరినీ పరీక్ష హాలులోకి అనుమతించరు.


ప్రభుత్వ పరీక్షల విభాగం సూచనలు

  • విద్యార్థులు ఒరిజినల్‌ హాల్‌ టికెట్‌ను తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నదైనా అనుమతిస్తారు.

  • బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయుంట్‌ పెన్నులు రెండు తెచ్చుకోవాలి. పెన్సిల్‌, ఎరేజర్‌, షార్ప్‌నర్‌, స్కేలు తీసుకెళ్లాలి.

  • పారదర్శకంగా ఉండే వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం మంచింది.

  • మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ ఉపకరణాలు అనుమతించరు.

  • పుస్తకాలు, కాగితపు ముక్కలు, నోట్‌ పుస్తకాలు తీసుకెళ్లకూడదు.

ఒత్తిడిని జయించండి

విద్యార్థులు ఒత్తిడిని జయించి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి సూచించారు. పరీక్షలు అనేవి జీవితంలో ఒక భా గం మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. ‘నేను రాయగలను. చదవగలను. సాధించగలను’ అనే ధీమాతో పరీక్షలు రాయాలని సూచించారు. క్లిష్టంగా ఉండే సబ్జెక్టులకు ఎక్కు వ సమయం కేటాయిస్తూ సమయపాలన పాటించాలన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 05:30 AM