నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తోంది!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:39 AM
నెల వయసున్నప్పుడు ఆ బిడ్డను వారు దత్తత తీసుకున్నారు.. మూడేళ్లు గడిచాయి! దత్తత ఇచ్చిన తల్లిదండ్రులు బాగానే ఉన్నారు.. దత్తత తీసుకున్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ దంపతులు, అభంశుభం తెలియని ఆ బిడ్డ నెలన్నరగా పరస్పరం ఏర్పడిన ఎడబాటు కారణంగా గుండెకోతను అనుభవిస్తున్నారు.
కరీంనగర్ సంరక్షణ కేంద్రం వద్దకొచ్చిన పెంపుడు తల్లిని
చూసి ఏడ్చిన మూడేళ్ల బాబు..
దంపతులూ కన్నీరుమున్నీరు
బిడ్డను దత్తత తల్లిదండ్రులకు అప్పగించాలన్న కోర్టు.. అయినా తాత్సారం
బాబును నేడు అప్పగిస్తామన్న జగిత్యాల కలెక్టర్
జగిత్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నెల వయసున్నప్పుడు ఆ బిడ్డను వారు దత్తత తీసుకున్నారు.. మూడేళ్లు గడిచాయి! దత్తత ఇచ్చిన తల్లిదండ్రులు బాగానే ఉన్నారు.. దత్తత తీసుకున్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ దంపతులు, అభంశుభం తెలియని ఆ బిడ్డ నెలన్నరగా పరస్పరం ఏర్పడిన ఎడబాటు కారణంగా గుండెకోతను అనుభవిస్తున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంతకే బిడ్డను చేర్చాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు తాత్సారం చేస్తున్నారు. చిన్నారిని తనివితీరా చూసుకునేందుకు సంరక్షణ కేంద్రానికి ఆ తల్లి వెళితే.. ‘నన్ను తీసుకెళ్లు అమ్మా.. ఇక్కడ భయంవేస్తోంది’ అంటూ ఆ బిడ్డడు గుక్కపెట్టి ఏడ్డాడు. అప్పటికే బాధతో బరువెక్కిన గుండెలతో ఉన్న ఆ దంపతులూ కన్నీరు అపుకోలేక భోరుమన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబి గద్దె ప్రాంతానికి చెందిన కాసారపు సరిత-శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు పిల్లలు కలగకపోవడంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును దత్తత తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత శ్రీనివాస్‌గౌడ్ బంధువులు ఆస్తి తగాదా విషయమ్మీద అతడితో గొడవపడి గత ఆగస్టులో బాలుడి దత్తతపై అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా శిశు సంరక్షణ అధికారులు జోక్యం చేసుకొని ఆ బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రుల నుంచి సెప్టెంబరు 16న స్వాధీనం చేసుకొని కరీంనగర్ శిశుగృహకు తరలించారు. దత్తత తీసుకున్న దంపతులు తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
బిడ్డను పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలంటూ అక్టోబరు 16న హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శిశు గృహ అధికారులు చిన్నారిని తమకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. బిడ్డను చూసేందుకు తాము కరీంనగర్ వెళ్లామని.. బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమకు అప్పగించాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి చట్టపరమైన నిబంధనలను సమన్వయం చేసుకుంటూనే చిన్నారి భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిడ్డను త్వరగా అప్పగించేలా చూడాలని వేడుకున్నారు.
బాలుడిని అప్పగిస్తాం: కలెక్టర్ సత్యప్రసాద్
సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. బాలుడిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు హైకోర్టు ఆశ్రయించగా హైకోర్టు జారీ చేసిన మద్యంతర ఉత్తర్వుల మేరకు బాబును దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీడబ్ల్యూసీ అనుమతి, ఇతర పరిపాలన పరమైన ప్రక్రియల కారణంగా బాలుడిని అప్పగించడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి మంగళవారం ఉదయం లోగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు బాలుడిని అప్పగిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News