ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:09 AM
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పనులు, నిధులను రాబట్టేందుకు దేశ ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులను ఎన్నిసార్లయినా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొందరు కావాలనే తనను విమర్శిస్తున్నారని, ఢిల్లీకి 70 సార్లు.. 78 సార్లు వెళ్లానని లెక్క పెడుతున్నారని తప్పుబట్టారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవాల్సిందే
పథకాల ఫలాలను ప్రజలకు అందించే బాధ్యత ఉద్యోగులదే
సంజయ్, నేను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చాం
పార్టీల సిద్ధాంతాలు వేరైనా ప్రజల కోసమే పనిచేయాలి
కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్
కరీంనగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పనులు, నిధులను రాబట్టేందుకు దేశ ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులను ఎన్నిసార్లయినా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొందరు కావాలనే తనను విమర్శిస్తున్నారని, ఢిల్లీకి 70 సార్లు.. 78 సార్లు వెళ్లానని లెక్క పెడుతున్నారని తప్పుబట్టారు. సీఎంగా తనకు శషభిషలులేవని, అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల్ని పరిష్కరించుకునే ధోరణిలో తాము ముందుకు వెళ్తామని, ఈ క్రమంలోనే వాటిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. బుధవారం కరీంనగర్‌లో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్డు అవసరం కోసం తాను ప్రధాని మోదీతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవడం వల్లే 170 ఎకరాల భూమికి క్లియరెన్స్ వచ్చిందన్నారు. 1994 నుంచి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరకు ఇక్కడి ముఖ్యమంత్రులు ప్రయత్నించినా కాని పనిని.. తమ హయాంలో నెరవేర్చుకున్నామని తెలిపారు. దీనివల్ల కంటోన్మెంట్ నుంచి కరీంనగర్‌కు వచ్చే మార్గంలో సిటీ బయటి వరకు రూ.5 వేల కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ వద్ద రన్‌వే కింద రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఏడాది లోపే కంటోన్మెంట్ ఏరియాలో రోడ్డును నిర్మించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు.
గౌరెల్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి..
గౌరెల్లి రిజర్వాయర్ పనులు 98 శాతం పూర్తయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయని, మిగతా పనులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. కొన్ని ప్రాజెక్టులకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుంటే ఆ పనులు నిష్ఫలమేనన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చామని, పార్టీల పరంగా సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో తామంతా ప్రజల కోసమే పనిచేయాలని వ్యాఖ్యానించారు. పలు సమస్యలతో నిస్సహాయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన పేదలను అధికారులు తమ ఇంటి సభ్యుల మాదిరిగా ఆదరించి వారి ఇబ్బందిని తీర్చాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు మొత్తంగా పరిష్కారం అయ్యాయని తాను చెప్పడంలేదని, ప్రజలకు సేవలందిస్తూనే ఉద్యోగుల ఇక్కట్లను తీర్చుకుందామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మంచి సేవలందిస్తేనే దేశంలో ప్రధానికైనా, రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా మంచి పేరు వస్తుందన్నారు.
ప్రభుత్వాలు శాసనాలు మాత్రమే చేస్తాయి
రాష్ట్రంలో 10.5లక్షల మంది (మూడు శాతం) ఉద్యోగులు... 95 శాతం మంది ప్రజలకు సేవలందించడం గొప్ప విషయమని సీఎం ప్రశంసించారు. సహాయ నిరాకరణ చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు, శాసనాలు చేయడం, అనుమతులు ఇవ్వడం మాత్రం చేస్తాయని, వాటి ఫలాలను ఉద్యోగులే ప్రజలకు చేరవేస్తారనే విషయాన్ని వివరించారు. రూ.944 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులకు కరీంనగర్‌లో శంకుస్థాపన చేశామన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అర్బన్ చాలెంజ్ డెవల్‌పమెంట్ ఫండ్ కూడా ఉందని తెలిపారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు చేరవేడయంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అసలైన అర్హులకు వాటిని అందించే విషయంలో మరింత చొరవ చూపించాలని అన్నారు. కాగా, రూ.51కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయం వెలుపల ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
ముస్లిం మతపెద్దల ప్రార్థనలకు సంజయ్ దూరం
కొత్త కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రాకు బాధ్యతలు అప్పగించిన సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అయితే అప్పటివరకు సీఎం పక్కనే ఉన్న బండి సంజయ్.. ముస్లిం మతపెద్దలు వచ్చి ప్రార్థనలు చేసే సమయంలో అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. వారి ప్రార్థనలు ముగిశాక సీఎం సహా మంత్రులు పిలవడంతో మళ్లీ వచ్చారు. అంతకుముందు సీఎం రాక కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేచి ఉన్న సమయంలో బండి సంజయ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలిసింది. సంజయ్‌కి శాలువా కప్పే సమయంలో తుమ్మల మాట్లాడుతూ, ‘ఇది భద్రాది రాముడి చెంత నుంచి తెప్పించిన శాలువా’ అంటూ చమత్కరించగా.. ‘మేమంతా పేదోళ్లం. శివుడి భక్తులం. మీరంతా ఉన్నోళ్లు కదా.. అందుకే ఆ శాలువాను సీఎంకు కప్పండి’ అంటూ సంజయ్ నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్ పెట్టుబడులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News