Share News

అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్‌ పెట్టుబడులు

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:01 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మూడు దక్కన్‌ సెరాయ్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఎట్‌ హోమ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ కూడా కేటీఆర్‌వేనన్నారు.

అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్‌ పెట్టుబడులు
Revanth Reddy

  • ఆయన భార్య, అత్త పేర్లపై హైటెక్‌ సిటీ వద్ద 3 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు.. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌

  • ఆర్నెల్ల కిందటే వారి పేరుమీదికి మారాయి

  • ఇది అబద్ధమైతే నా పేరు మార్చుకుంటా

  • కేటీఆర్‌కు దమ్ముంటే ఆయన ఆస్తులు, బంధువుల ఆస్తులపై శ్వేతపత్రం అడగాలి

  • దళితుడిని అధ్యక్షా అని పిలవాల్సి వస్తుందనే రెండున్నరేళ్లుగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావట్లే

  • ఇక సిరిసిల్లపై గురి.. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేని మంత్రిని చేస్తాం..

  • సభలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మూడు దక్కన్‌ సెరాయ్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఎట్‌ హోమ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ కూడా కేటీఆర్‌వేనన్నారు. ఆంధ్రావాళ్ల పేరుమీద ఉన్న ఈ రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఆరు నెలల కిందటే కేటీఆర్‌ పేరుమీదికి మారాయని తెలిపారు. మూడు దక్కన్‌ సెరాయ్‌ హోటళ్లు కేటీఆర్‌, ఆయన భార్య, అత్త పేరుమీద ఉన్నట్లు తాను నిరూపించలేకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఆయన ఆస్తులతోపాటు కేసీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌రావు, ఆయన బంధువుల ఆస్తులపై శ్వేతపత్రం అడగాలని సవాల్‌ చేశారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


‘‘తండ్రీ కొడుకులం కలిసుండటానికి హైదరాబాద్‌లో యోగ్యమైన ఇల్లు లేక.. తన తండ్రి చెట్ల కింద, తాను నానక్‌రామ్‌గూడ రాళ్ల సందుల్లో బతుకుతున్నామన్నట్లుగా కేటీఆర్‌ మాట్లాడుతున్నడు. అవలీలగా అబద్ధాలు చెబుతున్నడు. జన్వాడ, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లలోని కేటీఆర్‌, ఆయన చెల్లెలు, ఆయన బావ ఫాంహౌస్‌లు, ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌస్‌ సరిపోకపోతే.. హైటెక్‌ సిటీ పక్కన ఉన్న దక్కన్‌ సెరాయ్‌ హోటల్లో కలిసుండొచ్చు కదా?’’ అని రేవంత్‌ అన్నారు. కేటీఆర్‌కు ఉన్న మూడు దక్కన్‌ సెరాయ్‌ హోటళ్లలో.. ఒక్కో హోటల్లో 190 రూములు ఉన్నాయని, కేసీఆర్‌ కుటుంబంతోపాటు వారి జాతి మొత్తం వచ్చినా ఆ హోటల్లోని రూములు సరిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ వివరాలను ‘పార్ట్‌- 2’లో కూర్చోబెట్టి అడుగుదామనే అసెంబ్లీలో చెప్పలేదన్నారు.


‘‘కేటీఆర్‌కు వందల ఎకరాల భూములు, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌లో బంగళాలు ఉన్నాయి. అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులూ ఉన్నాయి. ఒకనాటి దుబాయి పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ కొడుక్కి.. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్ల వచ్చినయి? సిరిసిల్ల నుంచి దుబాయికి వెళ్లిన కార్మికుల బతుకులు ఎట్లున్నయి? సిరిసిల్ల ఓట్లు.. పచ్చనోట్లుగా మారి వేల కోట్ల విలువైన ఆస్తులు ఎట్ల వచ్చినవో ఒక్కసారి ఆలోచన చేయండి’’ అంటూ సిరిసిల్ల ప్రజల్ని ఉద్దేశించి రేవంత్‌ అన్నారు. కేటీఆర్‌ను భజాన మోసిన ఈ ప్రాంత ప్రజల బతుకులు అట్లాగే ఉన్నాయని, చేనేత కార్మికుల బతుకులు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఇక్కడి నుంచి గెలిచిన బిడ్డ క్యాబినెట్లో మంత్రి అయి వస్తారని ప్రకటించారు. పెద్ద కొడుకులా తోడుండి కష్టాలు తీరుస్తారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి నేతను గెలిపించి శాసనమండలికి పంపిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌, కేటీఆర్‌లకు గతమే తప్ప భవిష్యత్తు ఉండబోదని రేవంత్‌ జోస్యం చెప్పారు. సిరిసిల్లలో ఇక బీఆర్‌ఎస్‌ జెండా ఎగరబోదన్నారు. రాష్ట్రంలో 2034 వరకూ తమ ప్రజా పాలననే ప్రజలు అధికారంలో ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు.


దళితుడిని అధ్యక్షా అనాల్సి వస్తుందనే..

దళితుడు స్పీకర్‌ స్థానంలో కూర్చుంటే కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దళితుడిని అధ్యక్షా అనాల్సి వస్తుందనే గత రెండున్నరేళ్లుగా ఆయన అసెంబ్లీకే రావడంలేదన్నారు. అసెంబ్లీ ముందు స్పీకర్‌కు జరిగిన అవమానం అందరూ చూశారని, స్పీకర్‌ను పట్టుకుని అలా తిట్డడం హర్షించదగినదేనా? అని ప్రశ్నించారు. ‘‘అట్లెందుకు తిడతవు దొరా.. అంటూ ఎర్రవల్లి దగ్గర డప్పు కొట్టి అడిగితే.. పసుపు నీళ్లతో కడుగుతవా? దొర అహంకారమా నీకు?’’ అంటూ కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 20 శాతం దళితులు, పది శాతం గిరిజనులు ఈ అవమానాన్ని మర్చిపోలేరన్నారు. దళితులు నడిచిన నేలను పసుపు నీళ్లతో కడిగించిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించే దాకా ఈ దళిత సమాజం వదలబోదన్నారు.


కుటుంబ పాలన, గడీల ముందర బాంచెన్‌ దొర బతుకులు కావాలా? లేక దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అధికారం ఉండే ఇందిరమ్మ రాజ్యం కావాలా.. అన్నది ప్రజలే తేల్చుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి, మహే్‌షగౌడ్‌ల జోడీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురానుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన విజయశాంతిని ఎమ్మెల్సీని చేసుకున్నామని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్‌ సభ్యులుగా నియమించుకున్నామని తెలిపారు. ‘‘కేసీఆర్‌ మొదలు పెడితే.. రేవంత్‌రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేస్తున్నడని ఆయన బంట్రోతులు అంటున్నరు. కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని వారే పూర్తిచేసి ఉంటే.. రిబ్బన్‌ కటింగ్‌ చేయడానికి బదులు బస్టాండ్‌లో జేబులు కత్తిరించుకుంటూ తిరిగారా?’’ అని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆడబిడ్డలకు పెట్టే బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తీసుకున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. వచ్చే బతుకమ్మకు ఆడబిడ్లలకు చిలకపచ్చ రంగు చీర ఇస్తామని ప్రకటించారు.


ఈసారి సిరిసిల్ల గడీపై గురి..

రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల గడీపై గురి పెడదామని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల ఓట్లు.. కేసీఆర్‌ కుటుంబానికి పచ్చనోట్లుగా మారాయని, రూ.లక్ష కోట్లు సంపాదించిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని, గల్ఫ్‌ కార్మికులు, చేనేత కార్మికులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల శవాలను తెప్పించడానికి కూడా అప్పటి ప్రభుత్వం ప్రయత్నించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక గల్ఫ్‌ కార్మికులు చనిపోతే.. మృతదేహాలను తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని, వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకాన్ని తెచ్చామని తెలిపారు.


వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానన్నారని, భద్రాద్రి రామయ్యకు వజ్ర వైడూర్యాలు చేయిస్తానని చెప్పిన కేసీఆర్‌ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం కేసీఆర్‌ తన పదేళ్ల పాలనలో రూ.2,234 కోట్లు ఖర్చు పెడితే... తాము రెండున్నరేళ్లలో రూ.1,731 కోట్లను ఖర్చు పెట్టామని తెలిపారు. కాళేశ్వరం కట్టి కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, ఆయన సడ్డకుడి కొడుకు సంతోష్‌రావు మానేరు ఇసుకదొంగ అని, ముంపులో కొంప పోయిన సంతోష్‌కు రూ.10 వేల కోట్ల సంపద ఎలా వచ్చిందని అన్నారు. మిడ్‌ మానేరు ముంపు బాధితుల కింద సంతోష్‌రావు, రవీందర్‌రావు, జోగినపల్లి సౌమ్యారావు, వాళ్ల చిన్నాయన పేర్ల మీద 2015లో ఇళ్ల పట్టాలను తీసుకోలేదా? అని ప్రశ్నించారు. మీ ఇసుక దోపిడీకి అడ్డం వచ్చారని, నేరెళ్ల దళిత సోదరులను లారీలతో తొక్కించి, చంపించింది నిజం కాదా? అని నిలదీశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుగా.. ఆనాడు కేకే మహేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వేదికగా తీర్చిదిద్దిన సిరిసిల్లలో కేటీఆర్‌ దూరారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వేల మందితో పాదయాత్ర!

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 04:12 AM