కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?: మాజీ మంత్రి కేటీఆర్
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:12 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. యువతకు స్కిల్ లేదంటున్న రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ అంటూ వ్యాఖ్యానించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 5: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. యువతకు స్కిల్ లేదంటున్న రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు దొంగ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసాలపై బీఆర్ఎస్ చేపట్టిన యువభేరి సభకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు. లక్కీ లాటరీ తగిలి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ప్రధాని మోదీని గడగడలాడించిన యువతకు రేవంత్ ఓ లెక్క కాదన్నారు. తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెప్పారని.. ఇప్పుడేమైందని ప్రశ్నించారు. జాబులు లేవని.. నోటిఫికేషన్‌లు లేవన్నారు. లూటిఫికేషన్‌లు మాత్రం బ్రహ్మండంగా నడుస్తున్నాయని మండిపడ్డారు. వందరోజుల హామీలు నెరవేర్చక వెయ్యిరోజులు అవుతోందని అన్నారు.
కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రాజీనామా ఎవరు చేయాలి?.. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా? ప్రజలను మోసం చేసిన రేవంత్ రాజీనామా చేయాలా’ అని ప్రశ్నించారు. 420 మోసాలకు 420 సార్లు రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదని.. ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు ముందున్నాయన్నారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రాహుల్ ఎందుకు హైదరాబాద్‌కు రావడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలపై ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్నారన్నారు. 1000 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చింది 16 వేల ఉద్యోగాలే అని తెలిపారు. పదేళ్లలో తాము 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. ఉద్యోగాల కల్పనపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
రాధాకృష్ణన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేయాల్సిందే: ఎంపీ రఘునందన్
Read Latest Telangana News And Telugu News